కాలినడనక.. ‘జైశ్రీరామ్‌’ | - | Sakshi
Sakshi News home page

కాలినడనక.. ‘జైశ్రీరామ్‌’

Feb 4 2026 7:09 AM | Updated on Feb 4 2026 7:09 AM

కాలినడనక.. ‘జైశ్రీరామ్‌’

కాలినడనక.. ‘జైశ్రీరామ్‌’

సామర్లకోట: ‘జై శ్రీరామ్‌’ అని ముక్తకంఠంతో పెద్ద పెట్టున నినదిస్తూ.. సుమారు 200 మంది భక్తులు మండలంలోని అచ్చంపేట గ్రామం నుంచి కాలి నడకన భద్రాచలం యాత్రకు మంగళవారం శ్రీకారం చుట్టారు. గత 15 సంవత్సరాలుగా వాసుదేవ సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యాన భక్తులు ఏటా ఈ పాదయాత్ర చేస్తున్నారు. స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, గురుస్వామి ఈ యాత్రను ప్రారంభించారు. పాదయాత్ర చేస్తున్న వారికి గ్రామానికి చెందిన మహిళలు హారతులిచ్చారు. భక్తులకు గ్రామానికి చెందిన గరగ సూర్యనారాయణ, లక్ష్మి దంపతులు అల్పాహారం ఏర్పాటు చేశారు. జామి బంగార్రాజు, దేవి దంపతులు గొంచాల భద్రాద్రి రామాలయం వద్ద మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు. అచ్చంపేట నుంచి గొంచాల, ఉండూరు మీదుగా సాయంత్రం సామర్లకోట నూకాలమ్మ ఆలయం వద్దకు పాదయాత్ర చేరింది. ఆలయ ధర్మకర్త వల్లూరి బుల్లియ్య ఆధ్వర్యాన పాదయాత్రికులకు పలువురు స్వాగతం పలికారు. వల్లూరి బుల్లియ్య ఆధ్వర్యాన భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. పాదయాత్ర చేస్తున్న భక్తులకు ప్రతి గ్రామంలోనూ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా వాసుదేవ సుబ్బారావు స్వామి మాట్లాడుతూ, భద్రాద్రి పాదయాత్రకు 2012లో శ్రీకారం చుట్టామని తెలిపారు. జిల్లాలోని అనేక గ్రామాల నుంచి భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్నారన్నారు. భక్తుల సహకారంతో భద్రాద్రి రామాలయ నిర్మాణం, రథం తయారీతో పాటు పాదుకలు చేయించి, పాదయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. రామ నామజపంతో తొమ్మిది రోజుల పాటు ఈ పాదయాత్ర సాగుతుందన్నారు. సామర్లకోట నుంచి పెద్దాపురం, రాజానగరం, రాజమహేంద్రవరం, కొవ్వూరు, గోపాలపురం, కొయ్యలగూడరెం, బయ్యనగూడెం, అశ్వారావుపేట, కుడుములపాడు, అమరవరం మీదుగా 11వ తేదీ రాత్రికి భద్రాచలం స్వామి సన్నిధికి తమ యాత్ర చేరుకుంటుందని వివరించారు. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో అచ్చంపేట సర్పంచ్‌ వీరంరెడ్డి చినబాబు, వీరంరెడ్డి పెదబాబు పాల్గొన్నారు.

ఫ అచ్చంపేట నుంచి

భద్రాచలానికి పాదయాత్ర

ఫ ప్రారంభించిన 200 మంది భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement