నేటి నుంచి జాతీయ గోల్డ్‌కప్ హాకీ పోటీలు
ఫ ఈ నెల 14 వరకూ నిర్వహణ
ఫ దేశవ్యాప్తంగా తరలిరానున్న 24 జట్లు
ఫ పూర్తయిన ఏర్పాట్లు
ఫ టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి రవిచంద్ర
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి కాకినాడ డీఎస్‌ఏ మైదానంలోని యాస్ట్రో టర్ఫ్ హాకీ మైదానంలో నిర్వహించనున్న కోకనాడ గోల్డ్‌కప్ జాతీయ స్థాయి పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కె.రవిచంద్ర ప్రసాద్ మంగళవారం ఈ విషయం తెలిపారు. డీఎస్‌ఏ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హాకీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో 13 పురుషుల జట్లు, 8 మహిళల జట్లు పాల్గొంటున్నాయన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే క్రీడాకారులకు భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని, పోటీలను శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రారంభిస్తారని తెలిపారు.
చక్కని వేదిక
ద్రోణాచార్య అవార్డు గ్రహిత, భారత జట్టు మాజీ కెప్టెన్ ప్రీతిమ్ శివాజ్ మాట్లాడుతూ పూర్వ క్రీడాకారులందరూ కలుసుకోవడానికి ఈ పోటీలు చక్కని వేదిక అన్నారు. టోర్నమెంట్ నిర్వాహకుడు రవిచంద్రను ఆమె అభినందించారు. అడిషనల్ డీఎస్పీ లక్ష్మీపతి మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలు కాకినాడ వేదికగా జరగడం ఆనందంగా ఉందన్నారు. ఏపీ హాకీ సంఘ సంయుక్త కార్యదర్శి వి.రవి రాజు, డీఎస్‌డీఓ వి.సతీష్ కుమార్, డీఎస్‌ఏ హాకీ కోచ్ నాగేంద్ర, కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు బాబ్జీ, వినయ్, సూరిబాబు, హరిబాబు, పరశురాం, ఇండియన్ గోల్ కీపర్ రమ్య, సత్యగౌరి, నాగమణి, ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి సుధారాణి తదితరులు పాల్గొన్నారు.


