అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్తపై ఫిర్యాదు
రాజోలు: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజోలుకు చెందిన టీడీపీ కార్యకర్త నార్కెడమిల్లి కనకరాజుపై వైఎస్సార్ సీపీ నాయకులు మంగళవారం రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజోలు నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కనకరాజు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను నరికివేస్తానంటూ హెచ్చరికలు జారీ చేసిన కనకరాజుపై చర్యలు తీసుకోవాలని రాజోలు సీఐ నరేష్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం రాజోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్ మాట్లాడుతూ కూటమి పాలనలో అన్ని వర్గాలపై దాడులు పెరిగిపోయాయని, కూటమి ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింద న్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పూర్తిగా విస్మరించి రాక్షస పాలన సాగిస్తున్నారని విమర్శించారు. పార్టీ మండల అధ్యక్షుడు కట్టా శ్రీనివాసరావు, సర్పంచ్ రేవు జ్యోతి, గ్రామ శాఖ అధ్యక్షుడు అడబాల జానకిరామ్, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి నేతల నాని, నియోజకవర్గ అధ్యక్షుడు గుర్రం జాషువా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొల్లాబత్తుల సతీష్ ,ఎంపీటీసీ చెల్లింగి లక్ష్మీఈశ్వరి, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి బొడ్డపల్లి ప్రసాద్, కొల్లాబత్తుల శ్రీను, జిల్లెళ్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు.


