కోనపై కాలుష్యం కాటు
రెండెకరాల పంట నష్టపోయాను
పీబీసీ పక్కన పంట కాలువలో తరచుగా రసాయన వ్యర్థాలు పారబోస్తూండటంతో సాగునీరు కలుషితమై, పక్కనే ఉన్న నా రెండెకరాల పంట దెబ్బ తింది. రెండోసారి దమ్ము చేసి వరి నాట్లు వేయించుకోవాల్సి వచ్చింది. స్పిరిట్ పంట కాలువలో పారబోస్తూండటంతో నీరు రంగు మారడంతో పాటు చుట్టుపక్కల ఉండలేనంతగా దుర్వాసన ఉంటుంది. ఈ వ్యర్థాల పారబోత పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– సిద్దా సత్యనారాయణ, రైతు,
రావికంపాడు, తొండంగి మండలం
నీరు కలుషితం కాకుండా చూడాలి
పీబీసీ వద్ద ఆరెకరాల్లో వరి సాగు చేస్తున్నాను. పీబీసీ ద్వారా కొమ్మనాపల్లి వాటర్ స్టోరేజీ ట్యాంకుకు నీటిని పంపి, అక్కడి నుంచి రావికంపాడుతో పాటు ఏవీ నగరం, కోన గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. రసాయన వ్యర్థాలు పారబోయడంతో పంట కాలువలోని నీరు కలుషితమవుతోంది. దీంతో, తాగునీటి సరఫరా నిలిపివేశామని అధికారులు చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యం, పంటల సాగును దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాంతంలో రసాయన వ్యర్థాలు పారబోయడాన్ని పూర్తిగా నియంత్రించాలి.
– వెల్నాటి గంగారావు, రైతు,
రావికంపాడు, తొండంగి మండలం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లాలోని తీర ప్రాంతంలో ఎంతో సస్యశ్యామలంగా ఉండే తొండంగి మండలం కోన ప్రాంత ప్రజలు కాలుష్యం ముప్పుతో కలవరపడుతున్నారు. అటు పశ్చిమ గోదావరి, ఇటు విశాఖపట్నం జిల్లాల సరిహద్దుల నుంచి కొంత మంది స్వార్థపరులు పారిశ్రామిక, రసాయనిక వ్యర్థాలను ట్యాంకర్లతో తీసుకొచ్చి, ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో కుమ్మరిస్తున్నారు. ఎటువంటి అనుమతీ లేకుండా ఇలా నెలల తరబడి ఇక్కడ ఆ వ్యర్థాలను పారబోస్తున్నారు. ఈ వ్యర్థాలను కుమ్మరించేందుకు వచ్చిన ఓ ట్యాంకర్ ఇటీవల ఏవీ నగరం వద్ద పిఠాపురం బ్రాంచి కెనాల్(పీబీసీ)కి అనుసంధానంగా ఉన్న పంట కాలువలో బోల్తా పడింది. దీంతో, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతాన్ని కాలుష్య మయం చేస్తూండటంతో ఇక్కడి పంట భూములు, తాగునీటి వనరులు కలుషితమైపోతున్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికార పార్టీ నేతలు పైసల కోసం కక్కుర్తి పడి ఈ ట్యాంకర్లను అడ్డుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
50 వేల మందిపై ప్రభావం!
కోన ప్రాంత ప్రజల తాగు, సాగునీటి అవసరాలకు పిఠాపురం బ్రాంచ్ కెనాలే (పీబీసీ) దిక్కు. గొల్లప్రోలు మండలం నుంచి మల్లవరం చెరువుకు అనుసంధానంగా ఉన్న ఈ కెనాల్ నుంచి సముద్ర తీరంలోని ఏవీ నగరం, రావికంపాడు గ్రామాల మీదుగా కోదాడ ఉప్పు చెరువుకు నీటిని మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి కోదాడ, శృంగవృక్షంపేట, వాకదారిపేట, గోర్సపాలెం తదితర గ్రామాల్లోని ఏడెనిమిది వేల ఎకరాలకు సాగునీరు సరఫరా చేస్తారు. ఈ ఆయకట్టుపై సుమారు 1,200 మంది రైతులు ఆధారపడి ఉన్నారు. ఏవీ నగరం శివారు కొమ్మనాపల్లిలో 2003లో అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ రెండు గ్రామాలతో పాటు కోన ప్రాంత తాగునీటి అవసరాలను తీర్చేందుకు మంచినీటి పథకం ఏర్పాటు చేశారు. ఇక్కడి తాగునీటి స్టోరేజి ట్యాంకు ద్వారా ఏవీ నగరం, రావికంపాడు, కొమ్మనాపల్లి, కోదాడ, పెరుమాళ్లపురం పంచాయతీల్లోని సుమారు 23 గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 50 వేల మందికి నిత్యం 15 లక్షల లీటర్ల తాగునీటిని పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇన్ని గ్రామాలకు తాగు, సాగు నీరు సరఫరా అవుతున్న ఈ ప్రాంతంలోనే రసాయనిక వ్యర్థాలను కుమ్మరించేస్తున్నారు. ఫలితంగా తమకు తాగేందుకు గుక్కెడు నీరు కూడా గగనమే అవుతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి పంట పొలాల్లో గతంలో రెండు పర్యాయాలు స్పిరిట్ పారబోశారు. ఫలితంగా పంట భూములు కలుషితమయ్యాయి. అయితే, ఈ విషయాన్ని అప్పట్లో తాము గుర్తించలేకపోయామని పీబీసీ ఆయకట్టు రైతులు చెబుతున్నారు. తరువాత దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు, పాలకులు ముడుపులు మెక్కి మిన్నకుండిపోయారని ఆరోపిస్తున్నారు.
‘లక్ష’ణంగా దండుకుంటున్నారు
కోన ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్థాల డంపింగ్ తెలుగు తమ్ముళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. పంట భూములు కాలుష్య కాసారాలవుతున్నా.. అధికార టీడీపీలో నంబర్–2గా చక్రం తిప్పిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్వగ్రామం సైతం ఈ కాలుష్యం బారిన పడుతున్నా.. అధికార పార్టీ నేతలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. దీనినిబట్టి వారు ఏ స్థాయిలో లబ్ధి పొందుతున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వ్యర్థాల డంపింగ్‌కు వస్తున్న ఒక్కో ట్యాంకర్‌కు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకూ గుంజుతున్నారనే ఆరోపణలున్నాయి. వ్యర్థాల డంపింగ్‌పై ఎవరైనా ప్రశ్నించే లోపే ఆ ట్యాంకర్లను తప్పించేస్తున్నారు. గతంలో చీకటి పడిందంటే చాలు.. రావికంపాడు రైల్వే గేటు సమీపాన ఉన్న మామిడి తోటల్లో భారీ ట్యాంకర్లతో రసాయన వ్యర్థాలు పారబోసేవారు. దీనిపై అప్పట్లో రైతులు గగ్గోలు పెట్టారు. ఎంతో సస్యశ్యామలమైన కోన ప్రాంతం తమ్ముళ్ల స్వార్థానికి ఈ విధంగా బలైపోతోంది. ఏవీ నగరం వద్ద ఇటీవల ట్యాంకర్ బోల్తా పడిన వెంటనే తెలుగు తమ్ముళ్లు గుట్టు చప్పుడు కాకుండా దానిని బయటకు తీసి, వ్యవహారాన్ని చక్కబెట్టే ప్రయత్నాలు చేశారు. అయితే, సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం వైరల్ కావడంతో అధికారులు, పాలకుల తీరును రైతులు ఎండగట్టారు. ఆ సందర్భంగా రైతులను అక్కడి పోలీసులు గెంటేశారు. బాధిత రైతులకు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మద్దతుగా నిలిచారు. రసాయన వ్యర్థాల పారబోత, బోల్తా పడిన ట్యాంకర్ ఆధారంగా సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
స్టోరేజీ ట్యాంకుకు, పంట పొలాలకు వెళ్లే నీరందించే పీబీసీ
ట్యాంకర్ బోల్తా పడటంతో కాలువ నీటిపై తేలిన కాలుష్యం తెట్టు
ఫ అను‘మతి’ లేకుండా పారిశ్రామిక,
రసాయన వ్యర్థాల డంపింగ్
ఫ ఇతర జిల్లాల నుంచి
ట్యాంకర్లతో తరలింపు
ఫ కలుషితమవుతున్న పీబీసీ
ఫ 23 గ్రామాల్లో
తాగునీరు, పంటలకు ముప్పు!
ఫ ప్రజా క్షేమాన్ని గాలికొదిలేసి,
కాసులు దండుకుంటున్న ‘తమ్ముళ్లు’
కోనపై కాలుష్యం కాటు
కోనపై కాలుష్యం కాటు
కోనపై కాలుష్యం కాటు
కోనపై కాలుష్యం కాటు


