రాజకీయ ఫ్లెక్సీల ఏర్పాటుపై గరం గరం | - | Sakshi
Sakshi News home page

రాజకీయ ఫ్లెక్సీల ఏర్పాటుపై గరం గరం

Jan 15 2026 8:40 AM | Updated on Jan 15 2026 8:40 AM

రాజకీయ ఫ్లెక్సీల ఏర్పాటుపై గరం గరం

రాజకీయ ఫ్లెక్సీల ఏర్పాటుపై గరం గరం

జగ్గన్నతోటలో ఎన్నడూ లేని సంస్కృతి

ఫ్లెక్సీలు తొలగించకుంటే

తీర్థానికి వచ్చేది లేదన్న గ్రామస్తులు

అంబాజీపేట: కనుమ రోజున మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో నిర్వహించే ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై వివాదం రగులుతోంది. బుధవారం గంగలకుర్రులో గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రులకు చెందిన గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీకి సంబంధించి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి జగ్గన్నతోటను రాజకీయ తీర్థంగా మార్చారని సమావేశం ఆరోపించింది. మునుపెన్నడూ లేనివిధంగా జగ్గన్నతోట ప్రభల తీర్థానికి రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నూతన సంస్కృతికి తెర తీశారని ప్రభల కమిటీ సభ్యులు ఆరోపించారు. ఫ్లెక్సీలు తొలగించకుంటే రెండు గ్రామాల నుంచి వచ్చే ప్రభలు కౌశిక గట్టుపైనే ఉండి, తీర్థంలోకి వచ్చేది లేదన్నారు. అనంతరం ప్రభలు జరిగే జగ్గన్నతోట ప్రాంతాన్ని గ్రామస్తులు, భక్తులు పరిశీలించారు. ఈ విషయమై పి.గన్నవరం సీఐ ఆర్‌.భీమరాజుకు ఫిర్యాదు చేశారు. 470 ఏళ్ల చరిత్ర కలిగిన జగ్గనతోట ప్రభల తీర్థంలో ఇప్పటి వరకూ ఎటువంటి రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదని, జనసేన పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భక్తుల మనోభావాలకు భంగం కలిగించవద్దన్నారు. శివకేశవ యూత్‌ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభల తీర్థ విశిష్టతను తెలుపుతూ 2020లో ప్రధాని మోదీకి లేఖ రాశారని, దానికి బదులుగా ఏకాదశ రుద్రులపై సందేశం పంపారన్నారు. 2023లో 74వ గణతంత్ర వేడుకల్లో ఏకాదశ రుద్రుల ప్రభలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ శకటంగా ప్రదర్శించినప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదని గంగలకుర్రు అగ్రహారానికి చెందిన ఎంఎం శెట్టి వివరించారు. సీఐ మాట్లాడుతూ రాష్ట్ర పండగగా ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఫ్లెక్సీని నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. తీర్థంలో కాకుండా బయట ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదని, పార్టీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అభ్యంతరకరమని తక్షణమే తొలగించాలని సీఐకు వారు వివరించారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీలను తొలగించడం కుదరదని, చట్టవిరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. ఇదిలా ఉండగా జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో గ్రామాల్లో ఘర్షణలు, కవ్వింపు చర్యలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయా గ్రామాల ప్రభల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement