శివమణికంఠకు జాతీయ స్థాయి గుర్తింపు
కోటనందూరు: ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ –2026లో కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలేనికి చెందిన కొరుప్రోలు శివమణికంఠ పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచే ప్రయోగిక విద్యను అందిస్తూ ప్రయోగశాల జ్ఞానాన్ని నేరుగా పొలాలకు తీసుకెళ్లే విధానాన్ని ఆయన ప్రతిపాదించారు. శివమణికంఠ తన అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ముందు ప్రత్యక్షంగా పంచుకున్నారు. టాప్– 5 ప్రతిపాదనల్లో శివమణికంఠ ప్రతిపాదన ఉండడంతో ఆయనకు జాతీయ గుర్తింపు లభించింది. విద్య, పరిశోధనకు వ్యవసాయాన్ని అనుసంధానించే తన తన వినూత్న ఆలోచనలు దేశ వ్యవసాయ అభివృద్ధికి దిశానిద్దేశం చేస్తాయని నిపుణులు అన్నారు. విజయనగరం ట్రైబుల్ వెల్ఫేర్ సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న శివమణికంఠను స్థానిక పెద్దలు, అధ్యాపకులు అభినందించారు.
ఉరేసుకుని
యువకుడి ఆత్మహత్య
చింతూరు: స్థానిక శబరినది ఒడ్డున చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్ కథనం ప్రకారం.. శబరినది ఒడ్డున ఓ వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతూ ఉండడాన్ని ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహాన్ని కిందకు దింపి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు కాకినాడ జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన చెందక వెంకటేష్(27)గా గుర్తించామని, సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చినట్లు ఆయన వివరించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ప్రపంచంలోనే శక్తివంతం
ఏకాదశ రుద్రులు
అంబాజీపేట: విజయనగర సామ్రాజ్యంలో నిర్మించిన ఎన్నో ప్రాచీన దేవాలయాలు నేడు జీర్ణ దశకు చేరుకోవడంతో వాటి పునర్నిర్మాణం కోసం ప్రపంచంలోనే ఎంతో శక్తివంతమైన ఏకాదశ రుద్రుల ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినట్లు హంపీలోని పంపా క్షేత్ర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ అన్నారు. కె.పెదపూడిలో ప్రముఖ సిద్ధాంతి రాపాక శేషాచలం స్వగృహంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ కోనసీమలో ఎంతో శక్తివంతమైన ఏకాదశ రుద్రుల దేవాలయాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో అన్నవరం, అంతర్వేది లాంటి ఎన్నో మహిమాన్విత దేవాలయాలు ఉన్నాయన్నారు. విజయనగర సామ్రాజ్యంలో హంపిలో నిర్మించిన పలు దేవాలయాలు జీర్ణోద్ధారణ చేసే ముందు కోనసీమలో ఉన్న ఏకాదశ రుద్రుల దర్శించుకోవడం శ్రేయస్కరమని స్వామీజీ చెప్పారు. ఏకాదశ రుద్రుల పేర్లు వేరైనా వారి అంశ ఒక్కటేనని అన్నారు. ఏకాదశ రుద్రులు ఈ నాటివారు కారని వేదాలలోనే ఉందన్నారు. అయోధ్యలో రామ జన్మభూమి ఉన్నట్లు హంపిలో హనుమ జన్మభూమి నిర్మిస్తామన్నారు. రాబోయే 2027లో గోదావరి నదికి పుష్కరాలు వస్తున్నాయని, ప్రభుత్వం భక్తులకు సకల ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతకు ముందు ఏకాదశ రుద్రుల దేవాలయాలను స్వామీజీ దర్శించుకున్నారు.
శివమణికంఠకు జాతీయ స్థాయి గుర్తింపు


