రెప్పపాటులో మృత్యుకాటు
● విషాద ఉదయం
కిర్లంపూడి/ఏలేశ్వరం/ప్రత్తిపాడు: సమయం ఉదయం ఏడు గంటలు.. పనికి వెళుతున్న కూలీలు, కాలేజీకి వెళుతున్న విద్యార్థులతో ఆ ప్రాంతం రద్దీగా ఉంది. ఇంతలో ఓ కారు వారిపైకి దూసుకొచ్చింది. రెప్పపాటులో బీభత్సం సృష్టించింది. ముగ్గురి ప్రాణాలు తీసి, మరో ముగ్గురిని తీవ్రంగా గాయపర్చింది. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో దానిలోని వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. కిర్లంపూడి మండలం సోమవారం గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచోసుకుంది. మృతుల్లో ఒకరైన మోర్త ఆనందరావు కుమారుడు తాతారావు ఫిర్యాదు మేరకు కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.
వివాహానికి వెళ్లి వస్తూ..
విశాఖపట్నంలో కుమారుడి వివాహంలో పాల్గొన్న జగ్గంపేటకు చెందిన టీడీపీ నాయకుడు వేములకొండ జోగారావు, ఆయన భార్య, బంధువులు కారులో ఇంటికి బయలుదేరారు. సోమవారం గ్రామానికి వచ్చేసరికీ జోగారావు కనురెప్ప పడడంతో కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కనే మోటారు సైకిల్‌పై నిలిచి ఉన్న ఏలేశ్వరానికి చెందిన కాకాడ రాజు (60)ను ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత బిల్డింగ్ మెటీరియల్‌తో తోపుడు బండిని తోసుకు వస్తున్న సోమవరం గ్రామానికి చెందిన మోర్త ఆనందరావు (60), మోర్త కొండయ్య (31)ను ఢీకొంది. ఆ వేగానికి తోపుడు బండి నుజ్జునుజ్జయ్యింది. కారు అక్కడితో ఆగకుండా బస్ షెల్టర్‌లో నిలబడిన బత్తిన భద్రాన్ని గుద్దుకుంటూ షెల్టర్ దిమ్మ పైకి ఎక్కి లోపలకు దూసుకు పోయింది. కాలేజీకి వెళ్లటానికి అక్కడే కూర్చుని కుండ్రపు చైతన్య, చీపురుపల్లి ఫణిశ్రీ అనే యువతులను ఢీకొంది.
ఆర్తనాదాలు
రెప్పపాటులో కారు బీభత్సం సృష్టించడంతో అక్కడున్న వారందరూ భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో కొండయ్య, కాకాడ రాజు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించే మార్గం మధ్యలో ఆనందరావు కన్నుమూశాడు. గాయపడిన భద్రం, చైతన్య, ఫణిశ్రీలను కాకినాడ ఆసుపత్రికి తరలించారు. కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో దానిలో వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు వారిని బయటకు లాగి రక్షించారు.
మిన్నంటిన రోదనలు
ప్రమాదం జరిగిన కొద్ది సేపటికి మృతుల కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని విలపించడంతో ఘటనా స్థలం రోదనలతో నిండిపోయింది. జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, కిర్లంపూడి ఇన్‌చార్జి ఎస్సై రఘునాథరావు అక్కడకు చేరుకుని జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. బాధితులను మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో మృతదేహాలను ప్రత్తిపాడు, జగ్గంపేట సీహెచ్‌సీలకు తీసుకువెళ్లారు.
సీహెచ్‌సీకి మృతదేహాలు
ఆనందరావు, రాజు, మృత దేహాలను ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కు, కొండయ్య మృతదేహాన్ని జగ్గంపేట ఆస్పర్రికి తీసుకువెళ్లారు. వారిని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. బాధితులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరామర్శించారు. మట్టి ఖర్చుల కోసం మృతుల కుటుంబాలకు రూ.25 వేల వంతున ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆర్థిక సాయం చేశారు. కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు మృతుల కుటుంబాలతో ఫోన్‌లో మాట్లాడారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి:
మాజీ మంత్రి తోట నరసింహం
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జగ్గంపేట కో ఆర్డినేటర్, మాజీ మంత్రి తోట నరసింహం డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ప్రత్తిపాడు సీహెచ్‌సీలో పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ సోమవరం గ్రామంలో ఇది రెండో పెద్ద ప్రమాదమన్నారు. గతంలో జరిగిన ప్రమాదంలో కూడా ప్రాణనష్టం జరిగిందన్నారు. ఈ ప్రదేశంలో అండర్ నిర్మించాలని కోరారు. ఆయన వెంట పార్టీ నాయకులు అడబాల నాగు, అంబటి కొండలరావు, బళ్ల కామేశ్వరరావు తదితరులు ఉన్నారు.
రూ.50 లక్షల నష్ట పరిహారం అందించాలి:
ముద్రగడ గిరిబాబు
సోమవరం గ్రామంలో జరిగిన దుర్ఘటనపై వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక సీహెచ్‌సీలో కాకాడ రాజు కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఆయన మాట్లాడుతూ కాకాడ రాజు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఎకరం పొలం ఇవ్వాలని, రూ.50 లక్షల నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు గుడాల వెంకటరత్నం, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ శేరు కృష్ణ, సామంతుల సూర్య కుమార్, కోరాడ ప్రసాద్, వాగు బలరామ్, పినిశెట్టి ప్రకాష్, అందే చిట్టికొండ తదితరులు ఉన్నారు.
సోమవరం గ్రామంలో కారు బీభత్సం
అదుపు తప్పి జనం పైకి..
ముగ్గురి మృతి, మరో ముగ్గురికి గాయాలు
బాధిత కుటుంబాలకు
వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ
కాకినాడ క్రైం: సోమవరం గ్రామంలో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన ముగ్గురు క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వారిలో 52 ఏళ్ల బత్తిన భద్రం, 17 ఏళ్ల కూండ్రపు దుర్గా చైతన్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మరో బాధితురాలైన 17 ఏళ్ల చీపురుపల్లి ఆదిత్య ఫణిశ్రీ స్రవంతి ఆరోగ్యం నిలకడగా ఉంది. భద్రానికి తల, ఛాతి, కాళ్లకు తీవ్ర గాయాలవ్వడంతో ట్రామాకేర్ ఐసీయూలో అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతడికి వెంటిలేటర్‌పై వైద్య సేవలు కొనసాగుతున్నాయి. దుర్గా చైతన్యను ఆర్‌ఐసీయూ–2లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఎడమ తొడ ఛిద్రమైంది. శరీరంలో అతి బలమైన ఎముకై న ఫీమర్ మధ్య భాగం పూర్తిగా దెబ్బతిని మలద్వారం దిశగా చీలిక ఏర్పడింది. ఈ స్థితి ఆమెకు ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టింది. వీరిద్దరినీ రక్షించేందుకు వైద్యులు కష్టపడుతున్నారు. స్రవంతి ఎడమ కాలికి తీవ్రగాయం కావడంతో వైద్యం అందించి ఫీమేలు ఆర్ధో వార్డుకు ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు.
రెప్పపాటులో మృత్యుకాటు
రెప్పపాటులో మృత్యుకాటు
రెప్పపాటులో మృత్యుకాటు
రెప్పపాటులో మృత్యుకాటు
రెప్పపాటులో మృత్యుకాటు


