వాహనాల దొంగల ముఠా అరెస్టు
రూ.60 లక్షల విలువైన 40 వాహనాల స్వాధీనం
కాకినాడ క్రైం: సునాయాసంగా డబ్బు సంపాదించే లక్ష్యంతో మోటార్ వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ బిందుమాధవ్ శనివారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామానికి చెందిన పెమ్మాడి ఆశీర్వాదం, పెందుర్తి లోవరాజు, కరప గ్రామానికి చెందిన కాల కృష్ణార్జున్, కాకినాడ వెంకట్‌నగర్‌కి చెందిన కొల్లి దుర్గాప్రసాద్, జగన్నాథపురానికి చెందిన కనుమూరి గణేష్‌లకు వివిధ సందర్భాల్లో పరిచయం ఏర్పడింది. స్నేహితులుగా మారిన వీరు చెడు వ్యసనాలకు బానిసలుగా మారారు. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో సుమారు ఏడాదిన్నరగా వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళం లేకపోయినా తాడు సాయంతో ఆటో ఇంజిన్ స్టార్ట్ చేయడం, ద్విచక్ర వాహనాలను నకిలీ తాళంతో తస్కరించడంలో వీరు దిట్ట. ఇలా కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వీరు చోరీలకు పాల్పడ్డారు. ఆయా పోలీస్ స్టేషన్లలో వీరిపై మొత్తం 40 కేసులు నమోదయ్యాయి. సుమారు రూ.60 లక్షల విలువైన 18 ఆటోలు, 22 ద్విచక్ర వాహనాలను వీరి నుంచి స్వాఽధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. శుక్రవారం రాత్రి విరవాడ సెంటర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఎస్‌డీపీవో పాటిల్ దేవరాజ్ మనీష్ పర్యవేక్షణలో సీసీఎస్ సీఐ వి.కృష్ణ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించారని ఎస్పీ చెప్పారు. ఆయనకు పిఠాపురం సీఐ శ్రీనివాస్ బృందం సహకరించినట్టు తెలిపారు.


