పాత స్నేహితులే ప్రాణం తీశారు
● వీడిన శ్రీనివాస్ హత్య కేసు మిస్టరీ
● 8 మంది అరెస్ట్, పరారీలో మరొకడు
● వివరాలు వెల్లడించిన
ఎస్పీ రాహుల్ మీనా
అమలాపురం టౌన్: పాత స్నేహితులే కాలయములయ్యారు. మాట్లాడాలని పిలిచి మిత్రుడిని హత్య చేశారు. అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీనివాస్ హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ ఘటనకు సంబంధించి 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనా ఈ వివరాలు వెల్లడించారు. నిందితులను ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు, క్రైమ్ సీఐ ఎం.గజేంద్ర కుమార్, పట్టణ ఎస్సైలు ప్రవేశపెట్టారు. ప్రధాన నిందితుడైన ఎ–1 పట్టణానికి చెందిన గంగుమళ్ల షణ్ముఖేశ్వరరావు (కాసుబాబు), అడబాల శంకర్ బంగారు (వరసకు కాసుబాబు కుమారుడు), సలాది రాంబాబు (అప్పన్న), భాస్కర్ల దుర్గ నాగ ప్రసాద్ (డ్రైవర్), అమలాపురం రూరల్ మండలానికి చెందిన కరాటం నరేష్, రాజోలు మండలం వేగివారిపాలేనికి చెందిన యర్రంశెట్టి లింగయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా నాగారం గ్రామానికి చెందిన మోరం సత్యగంగా మాణిక్యాలరావు, మోరం వీర వెంకట సత్య శ్రీనివాస్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసులో ఎ–5 నిందితుడైన రావులపాలేనికి చెందిన పెనుమంట్ల అనిల్ పరారీలో ఉన్నాడు. వీరిని ముమ్మిడివరం పరిసర ప్రాంతాల్లో వివిధ చోట్ల శుక్రవా రం అరెస్ట్ చేశారు. కాల్ డేటాలు, వీడియో, ఆడియో పుటేజీల ఆధారంగా కేసును ఛేదించారు. హత్యకు ఉపయోగించిన కత్తి, మూడు కార్లు, ఒక బైక్, స్కూటర్, 15 సెల్ ఫోన్లను నిందితులను నుంచి స్వాధీనం చేసుకునిసీజ్ చేశారు.
హత్య జరిగిన తీరు
అమలాపురం పట్టణంలో రౌడీగా చెలామణి అవుతున్న కాసుబాబును దూషిస్తూ కంచిపల్లి శ్రీనివాస్ మాట్లాడిన మాటల ఆడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అప్పటికే అప్పులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కాసుబాబు ఆ ఆడియా తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసిందని భావించాడు. మళ్లీ రౌడీగా తన ఉనికి చాటుకునేందుకు, భయం పుట్టించేందుకు శ్రీనివాస్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ పాత స్నేహితులైన సలాది రాంబాబు, భాస్కర్ల దుర్గా నాగ ప్రసాద్‌ను సంప్రదించి, హత్యకు పథకం చేశాడు. ఆ ప్రకారం.. గత నెల 25న కంచిపల్లి శ్రీనివాస్‌ను మాట్లాడే పని ఉందంటూ సలాది రాంబాబు, భాస్కర్ల దుర్గా నాగప్రసాద్ పిలిచారు. రాత్రి 11.30 గంటల సమయంలో కారులో తీసుకువెళ్లి మద్యం పట్టించారు. అనంతరం అంబాజీపేట మండలం వక్కలంక వద్ద శ్రీనివాస్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు. మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి ఆ దృశ్యాన్ని వీడియో తీసి కాసుబాబు స్మార్ట్ ఫోన్‌కు పంపించారు. అదే రోజు రాత్రి పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగపల్లి వద్ద వైనతేయ గోదావరిలో మృతదేహాన్ని పడేశారు.
కేసు నమోదు
ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాస్ తిరిగి రాకపోవడంతో అతడి భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 27న పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. అయితే 29న వైనతేయ నదితో శరీరంపై గాయాలతో శ్రీనివాస్ మృతదేహం కనిపించడంతో హత్య కేసుగా మార్చి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసు అధికారులకు ఎస్పీ అభినందన
ఈ కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి మిస్టరీ ఛేదించిన డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు, క్రైమ్ సీఐ ఎం.గజేంద్ర కుమార్, ఎస్సై ఎన్‌ఏ కిషోర్ బాబు, ఐటీ కోర్ టీమ్ సిబ్బందిని, కానిస్టేబుళ్లను ఎస్పీ మీనా ప్రత్యేకంగా అభినందించారు.


