కడు రమ్యమై.. నేత్రపర్వమై..
అన్నవరం: నింగి వీధుల నుంచి చల్లని చంద్రుడు ప్రసరిస్తున్న తెల్లని కిరణాల కాంతుల్లో.. క్షీర సాగరాన్ని తలపిస్తున్న పావన పంపా సరోవరంలో.. భక్తవరదుడైన సత్యదేవుని తెప్పోత్సవం ఆదివారం రాత్రి కడు రమ్యంగా.. కన్నుల పండువగా జరిగింది. క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుక నిర్వహించారు. వేద పండితుల సుస్వర మంత్రోచ్చారణలు.. మంగళ వాయిద్యాల ఘోష.. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా కాల్పుల నడుమ.. సర్వాంగ సుందరంగా అలంకరించిన హంస వాహనంపై.. రత్నగిరివాసుడు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లు పంపా జలాల్లో మూడుసార్లు విహరించారు. ఈ సుమనోహర దృశ్యాన్ని కన్నులారా చూసి.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు పులకించారు.
ఉత్సవం నిర్వహించారిలా..
ఫ సాయంత్రం 5.30 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను, క్షేత్ర పాలకులు సీతారాములను మేళతాళాలతో ఊరేగింపుగా రత్నగిరి నుంచి పంపా తీరానికి తీసుకువచ్చారు. అక్కడ, దివ్యంగా అలంకరించిన మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సింహాసనంపై సత్యదేవుడు, అమ్మవార్లను, ఆ పక్కనే మరో ఆసనంపై సీతారాములను వేంచేయించారు. వేదపండితులు అక్కడ తులసీ ధాత్రి పూజ నిర్వహించి, సత్యదేవుడు, అమ్మవార్లకు వేదాశీస్సులు అందజేశారు.
ఫ సత్యదేవుడు, అమ్మవార్లను సాయంత్రం 6.30 గంటలకు మేళతాళాల నడుమ ఊరేగింపుగా పంపా ఒడ్డున అప్పటికే సిద్ధంగా ఉంచిన హంస వాహనం మీదకు తీసుకువచ్చారు. దానిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో వేంచేయించి, పునఃపూజలు నిర్వహించి, హారతులిచ్చి, తెప్పోత్సవం ప్రారంభించారు.
ఫ నీలాల నింగిలో నిశి వేళ రంగురంగుల పూలు విరబూసినట్టుగా.. ఉత్సవం సాగుతున్న సమయంలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా కాల్పులు జరిపారు.
ఫ పంపా తీరం వెంబడి, ఘాట్ రోడ్డు పొడవునా ఉన్న భక్తులు.. రాత్రి 8.30 గంటల వరకూ జరిగిన ఈ వేడుకను తిలకించి, పులకించారు.
ఫ ఉత్సవం ముగిసిన అనంతరం స్వామి, అమ్మవార్లను మేళతాళాలతో తిరిగి రత్నగిరికి చేర్చారు.
ఫ ఉత్సవం అనంతరం ఘాట్ రోడ్డు టోల్ గేటు వద్ద భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఫ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు తదితరులు పాల్గొన్నారు.
ఫ వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, యనమండ్ర శర్మ, గంగాధరభట్ల గంగబాబు, శివ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్, అర్చకులు సుధీర్, దత్తాత్రేయశర్మ, రామ్‌కుమార్ తదితరులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఫ సత్యదేవుని తెప్పోత్సవాన్ని పురస్కరించుకుని టోల్ గేటు నుంచి పంపా తీరం వరకూ రంగురంగుల విద్యుద్దీపాలను శోభాయమానంగా అలంకరించారు. వీటి కాంతులతో పాటు బాణసంచా వెలుగులో ప్రతిబింబించడంతో పంపా సరోవరం కూడా కొత్త అందాలను అద్దుకుంది.
విస్తృత బందోబస్తు
తెప్పోత్సవం సందర్భంగా ఎంటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యాన ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు, అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు, 300 మంది పోలీసులతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా తుని అగ్నిమాపక శకటాన్ని పంపా తీరం వద్ద సిద్ధంగా ఉంచారు. తెప్పోత్సవం జరిగినంతసేపూ జలాశయంలో గజ ఈతగాళ్లతో రెండు మోటార్ బోట్లు హంసవాహనం చుట్టూ రక్షణగా తిరిగాయి.
ఫ వైభవంగా సత్యదేవుని తెప్పోత్సవం
ఫ పంపా సరోవరంలో హంస వాహనంపై
స్వామి, అమ్మవార్ల విహారం
ఫ వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం
కడు రమ్యమై.. నేత్రపర్వమై..
కడు రమ్యమై.. నేత్రపర్వమై..
కడు రమ్యమై.. నేత్రపర్వమై..


