రత్నగిరిపై భక్తజనసంద్రం
ఫ సత్యదేవుని దర్శించిన 60 వేల మంది
ఫ 6,200 వ్రతాలు
ఫ రూ.60 లక్షల ఆదాయం
అన్నవరం: క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రత్నగిరి భక్తజన సంద్రమే అయ్యింది. సత్యదేవుని దర్శించుకునేందుకు ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయాన్ని తెల్లవారుజామున 2 గంటకు తెరచి పూజలు చేసి, భక్తులను సత్యదేవుని దర్శనానికి అనుమతించారు. స్వామివారి వ్రతాలు కూడా తెల్లవారుజామున 2 గంటల నుంచే నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. దీంతో, ఉదయం 9 గంటల నుంచే అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు. వెలుపలి నుంచే సత్యదేవుని దర్శించేలా ఏర్పాట్లు చేశారు. యంత్రాలయ దర్శనాలకు కూడా వెలుపలి నుంచే అనుమతించారు. వ్రత మండపాలతో పాటు నిత్య కల్యాణ మండపంలో కూడా సత్యదేవుని వ్రతాలు నిర్వహించారు. సుమారు 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. వ్రతాలు 6,200 జరిగాయి. సుమారు 15 వేల మందికి పులిహోర, దధ్యోదనం పంపిణీ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు చెప్పారు. వ్రత మండపాలు, క్యూ లైన్లు, స్వామివారి ఆలయంలో ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ పరిశీలించి, సిబ్బందికి తగు సూచనలిచ్చారు.
నేడు కూడా భక్తుల తాకిడి
కార్తిక మాసం రెండో సోమవారం కావడంతో రత్నగిరికి నేడు కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. సుమారు లక్ష మంది వస్తారని, 10 వేలకు పైగా వ్రతాలు జరుగుతాయనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి వ్రతాలు వేకువజామున ఒంటి గంటకు ప్రారంభించనున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
తగ్గిన వ్రతాలు
గత ఏడాది కార్తిక మాసంతో పోలిస్తే ఈసారి వ్రతాల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది కార్తికం గత నెల 21న ప్రారంభమైంది. నాటి నుంచి ఆదివారం వరకూ మొత్తం 13 రోజుల్లో 34,350 వ్రతాలు జరిగాయని అధికారులు తెలిపారు. గత ఏడాది కార్తికం మొదటి 13 రోజుల్లో ఏకంగా 50,878 వ్రతాలు జరిగాయి. గత నెల 28 నుంచి 31వ తేదీ వరకూ మోంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో నాలుగు రోజుల పాటు ఆలయానికి భక్తులు పెద్దగా రాలేదు. ఫలితంగా గత ఏడాది కార్తికం కన్నా వ్రతాలు 16 వేలు తక్కువగా జరిగాయి. 2022 కార్తికంలో 1,42,373 వ్రతాలు జరిగాయి. 2023 కార్తికంలో మిచాంగ్ తుపాను ప్రభావంతో వారం రోజుల పాటు భక్తులు పెద్దగా రాలేదు. దీంతో ఆ ఏడాది 1,25,000 వ్రతాలు మాత్రమే జరిగాయి. గత ఏడాది కార్తికంలో ఎటువంటి విపత్తులూ లేకపోవడంతో వ్రతాల సంఖ్య 1,47,122కు పెరిగింది. దీనిని అధిగమించాలంటే ఈ కార్తికంలో అధికమించాలంటే ఇంకా 1.13 లక్షల వ్రతాలు జరగాల్సి ఉంది.


