కన్నీరే మిగిలింది
కరప మండలం జెడ్.భావారంలో నీటిలో నానుతున్న వరి పంట
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘మరో వారం రోజులు ఆగితే గట్టెక్కేసే వాళ్లమే. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వేసిన పంట చేతికొచ్చే తరుణంలో ప్రకృతి కన్నెర్ర చేసింది. కోలుకోలేని దెబ్బ కొట్టింది. అసలు ఈ విపత్తు నుంచి బయటపడతామనే నమ్మకం కోల్పోయాం. నిండా మునిగిన పంట దక్కుతుందో లేదో తెలియడం లేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాని అయోమయంలో పడ్డాం.’
● జిల్లాలో ఏ రైతును కదిలించినా ఇదే ఆవేదన వ్యక్తమవుతోంది. దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని, ఎకరాకు కనీసం 40 బస్తాలకు తక్కువ కాకుండా వస్తాయని చాలా మంది రైతులు ఆశ పడ్డారు. చేసిన అప్పులు తీసేయగా ఎకరాకు గరిష్టంగా రూ.20 వేలయినా మిగులుతాయని లెక్కలేసుకున్నారు. తీరా చూస్తే తమ ఆశలపై మోంథా తుపాను నీళ్లు జల్లేసి, పంటల్ని తుడిచిపెట్టేసిందని వివిధ గ్రామాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మోంథా తుపానుతో నిండా మునిగిన పంట పొలాల్లో రైతుల ఇబ్బందులపై శుక్ర, శనివారాల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది. ఎక్కడ చూసినా కన్నీటిపర్యంతమైన రైతులే కనిపించారు.
ఎక్కడ చూసినా అదే వేదన
● పిఠాపురం, గొల్లప్రోలు, గోకవరం, పెద్దాపురం, సామర్లకోట, కరప, తాళ్లరేవు తదితర మండలాల్లోని గ్రామాల్లో రైతులను పలకరిస్తే తమ కష్టమంతా నీటి పాలైందని చెమర్చిన కళ్లతో చెబుతున్నారు. ఆయా మండలాల్లోని పెనుగుదురు, నడకుదురు, వేములవాడ, వేళంగి, కొవ్వూరు, చెందుర్తి, చేబ్రోలు, పవర, పనసపాడు, సర్పవరం తదితర గ్రామాల్లో పలకరించిన ప్రతి రైతు కళ్ల వెంబడి నీళ్లు సుడులుగా తిరిగాయి.
● కరప, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లోని పలు గ్రామాల్లో వరి పంట వెన్ను వరకూ ముంపులో నానుతూ కనిపించింది. ఇక ఆ పంట దక్కడం దేవుని దయ పైనే ఆధారపడి ఉంటుందని రైతులు తీరని వేదనతో చెప్పారు. ముంపు నీరు దిగక పొట్టలు కుళ్లిపోయి ధాన్యం తాలుగా మారిపోతుందని చెప్పారు.
● ఈనిక దశ నుంచి గింజ పాలు పోసుకునే దశలో పంట ఉండగా ఇంతటి దారుణంగా నష్టపోతామని అనుకోలేదని రైతులు గొల్లుమంటున్నారు. సగంలో సగమైనా పంట చేతికందుతుందనే నమ్మకం లేదని, ప్రతి ఎకరా వరి సాగుకు పెట్టిన సుమారు రూ.36 వేల పెట్టుబడి కళ్లెదుటే కరిగిపోతోందని కన్నీటిపర్యంతమవుతున్నారు.
● సామర్లకోట, పెద్దాపురం, గొల్లప్రోలు, పిఠాపురం తదితర మండలాల్లోని గ్రామాల రైతులు ఏలేరు జలాశయం పోటెత్తడమే తమ కొంప ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదంటే ఈసారి పంటలో సిరులు కురిసేవని చెప్పారు. ఏలేరు పరీవాహక ప్రాంతాల్లో డ్రైన్‌లకు పూడికలు తీయకపోవడంతో తమ పొలాలు ముంపునకు గురవుతున్నాయని పలువురు రైతులు వాపోయారు. ఈ ప్రాంతాల్లో గుర్రపు డెక్కతో పూడుకుపోయిన డ్రెయిన్ల నుంచి మురుగు నీరు దిగక నష్టపోయిన రైతులే కనిపించారు.
● జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని నియోజకవర్గాల్లోని సుమారు 67 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు రైతుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. సుమారు 10 వేల క్యూసెక్కుల నీరు అవలీలగా పారేలా రూపొందించిన ఏలేరు కాలువలు అవసాన దశకు చేరుకున్నాయి. గతంలో 100 మీటర్ల వెడల్పుతో ఉండే ఏలేరు కాలువ ఆక్రమణలతో ప్రస్తుతం 20 మీటర్లు కూడా లేనివిధంగా కుచించుకుపోయింది. పలుచోట్ల గట్లు కోతకు గురై, అండలుగా జారి శిథిలావస్థకు చేరడం ఏలేరు రైతులకు పెను సవాల్‌గా మారింది.
● పొలాల్లోని ముంపు నీరు బయటకు వెళ్లే దారి లేక, పంటను కాపాడుకునే ప్రయత్నాల్లో పలువురు రైతులు ఉన్నారు. కొన్నిచోట్ల రైతులు వరి దుబ్బులను కట్టలుగా కట్టి రోడ్డు పైకి తెచ్చి మాసూలు చేసుకుంటున్నారు. ముంపు నీరు లాగినా.. నేలనంటేసిన పంట కోతకు కూడా పనికిరాదని చెబుతున్నారు.
మోంథా తుపానుతో కుదేలైన రైతులు
పంట చేతికందే సమయంలో తీరని నష్టం
ఈదురు గాలులు, వర్షానికి నేలకొరిగిన వరి
పెట్టుబడులు చేతికందే
పరిస్థితి లేదని గగ్గోలు
నష్టాలు ఇలా...
ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లా రైతులు 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. మోంథా తుపాను తాకిడితో 60 వేల ఎకరాల్లో పంట సర్వనాశనమైంది. దీంతో, 33,590 మంది రైతుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఒక్క వరి పంటకే రూ.150 కోట్లు పైగా నష్టం వాటిల్లిందన్నది ప్రాథమిక అంచనా.
సుమారు 1,200 మంది రైతులకు సంబంధించి సుమారు 2 వేల ఎకరాల్లో మిర్చి, పత్తి, దొండ వంటి పంటలు దెబ్బ తిన్నాయి.
ఏలేరు పొంగి ప్రవహిస్తూండటంతో సుమారు 52 వేల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పెద్దాపురం, సామర్లకోట మండలాల్లో 20 వేల ఎకరాలు, కాజులూరులో 18,700 ఎకరాల్లో సాగు జరగగా సుమారు 80 శాతం పంటకు నష్టం వాటిల్లిందన్నది అధికారుల ప్రాథమిక అంచనా.
జిల్లాలో పంట నష్టం వివరాలు
ముంపునకు గురైన వరి 60,000 ఎకరాలు
వరి నష్టం అంచనా రూ.150 కోట్లు పైనే
పత్తి 7,000 ఎకరాలు
మొక్కజొన్న 2,000 ఎకరాలు
మిర్చి 300 ఎకరాలు
కన్నీరే మిగిలింది


