జీజీహెచ్ హ్యాట్రిక్
కాకినాడ క్రైం: తల్లీబిడ్డలు బాగుంటే కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందనే సూత్రంతో నూరా హెల్త్ సంస్థ మాతాశిశు సంరక్షణ కోసం నిర్వహిస్తున్న కేర్ కంపానియన్ ప్రోగ్రాం (సీసీపీ) అమలులో కాకినాడ జీజీహెచ్ హ్యాట్రిక్ సాధించింది. ఈ కార్యక్రమాన్ని కొన్నాళ్లుగా నిర్వహిస్తున్నప్పటికీ గడచిన మూడు నెలల్లో ఎన్నడూ లేని పురోగతి సాధిస్తోంది. వరుసగా మూడుసార్లు రాష్ట్రంలోనే ఉత్తమ స్థానంలో నిలిచింది. తద్వారా మాతాశిశు సంరక్షణలో కీలక భూమిక పోషిస్తోంది. సీసీపీ కార్యక్రమం కింద జీజీహెచ్‌లోని ఎన్‌ఐసీయూ, పీఐసీయూ, ఎస్‌ఎన్‌సీయూ, ఏఎన్‌సీ, పీఎన్‌సీ, పోస్ట్ గైనిక్ విభాగాల్లో వైద్య సేవలు పొందుతున్న బాలింతలు, వారి సహాయకులకు మాతా శిశు సంరక్షణపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమ నిర్వహణకు జిల్లా కన్సెల్టెంట్‌గా పబ్లిక్ హెల్త్ నిపుణుడు డాక్టర్ వేదాంతం కార్తీక్‌ను కాకినాడ, కోనసీమ జిల్లాల ప్రత్యేకాధికారిగా నియమించారు. మాతృ సంరక్షణ, శిశు మరణాల నివారణే సీసీపీ లక్ష్యం. ఈ దిశగా తల్లితో పాటు శిశువుకు సంరక్షకులుగా వ్యవహరిస్తున్న వారికి అవగాహన కల్పిస్తారు. రక్షణ చర్యలు బోధించడం, ఆసుపత్రిలో చేరికలు తగ్గించడం, తల్లీబిడ్డలను పూర్తి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం లక్ష్యాలు.
శిక్షణ ఇలా..
స్థానిక భాషలో వీడియోలు, పోస్టర్లు, లైవ్ డెమోలు ఇవ్వడం ద్వారా తల్లికి, శిశు సంరక్షకులకు శిక్షణ ఇస్తున్నారు. 30 నుంచి 40 నిమిషాల పాటు సెషన్లు నిర్వహిస్తారు. ప్రతి సెషన్‌కు కనిష్టంగా 5 నుంచి 25 మంది వరకూ బాలింతలు, వారి సహాయకులు ఉంటారు. అవగాహన అనంతరం, క్విజ్ నిర్వహించి ఫీడ్‌బ్యాక్ కోరుతారు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ 12 నుంచి 15 సెషన్లు నిర్వహిస్తున్నారు. చంటిపిల్లల విభాగం తొలి అంతస్తులో టెర్మ్, ప్రీ టెర్మ్, సెప్సి, స్టెప్‌డౌన్ యూనిట్లతో పాటు రెండో అంతస్తులోని టెర్మ్, ప్రీ టెర్మ్, రూమ్–ఎ, బిలలో ఈ సెషన్లు జరుగుతున్నాయి.
తల్లికి..
ప్రసవానంతరం ఆరోగ్య సంరక్షణకు సూచనలు చేస్తారు. తీసుకోవలసిన ఆహారం నుంచి రోజువారీ అలవాట్లపై అవగాహన కల్పిస్తారు. వైవాహిక జీవితంపై అవగాహన కల్పించి, మరో బిడ్డను కనాలనుకుంటే ఆ ప్రణాళికను వివరిస్తారు. ఇల్లు, పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణపై అవగాహన కల్పిస్తారు. ప్రసవానంతరం రుతుక్రమాన్ని, ఆ సమయంలో ఉండే విధానాన్ని వివరిస్తున్నారు. రక్తహీనతను దూరం చేసే శాసీ్త్రయ విధానాలపై అవగాహన కల్పిస్తారు. ముర్రుపాల ప్రయోజనాన్ని తల్లికి వివరిస్తారు. సిజేరియన్ జరిగితే, తీసుకోవలసిన జాగ్రత్తలపై తల్లితో పాటు సహాయకులకు సూచనలిస్తారు. ప్రభుత్వ ప్రయోజనాలను పొందేందుకు దరఖాస్తు చేసుకునే విధానం వివరిస్తారు. జీజీహెచ్‌లోని మదర్ మిల్క్ బ్యాంకు ప్రయోజనాలను తెలియజేస్తారు. బిడ్డ ఆకలికి తగినట్టుగా పాలు స్రవించేలా అవగాహన పెంపొందిస్తారు. ప్రసవానంతర ఆరోగ్యం, శరీర సౌష్టవాన్ని పెంపొందించుకునేందుకు వ్యాయామాలు, యోగాసనాలను వివరిస్తారు.
బిడ్డ కోసం..
బిడ్డకు అందించాల్సిన ద్రవరూప పోషకాహారాలను పరిచయం చేస్తారు. శిశువు వివిధ అనారోగ్యాలకు గురైతే వాటిని ముందుగానే గుర్తించేలా లక్షణాలను వివరిస్తారు. వయసుకు తగ్గ బరువు పెరిగేందుకు పౌష్టికాహారాన్ని సూచిస్తారు. టీకాల ప్రణాళికను వివరిస్తారు. బిడ్డ నమోదు, జనన ధ్రువీకరణ పత్రాలను పొందడంలో సహాయసహకారాలు అందిస్తారు. తల్లీబిడ్డలకు అందాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలు ఏవైనా ఉంటే వాటిని సకాలంలో అందేలా చూస్తారు. ఫార్ములా ఫీడ్ తయారు చేసే విధానంపై అవగాహన కల్పిస్తారు. పాలు పట్టిన తర్వాత అరుగుదలకు బిడ్డను ఎత్తుకునే విధానంతో పాటు వివిధ పొజిషన్లు, బర్ఫింగ్‌పై అవగాహన పెంపొందిస్తారు.
మొదటి స్థానంలో నిలిచిందిలా..
గత జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అత్యధిక సెషన్లు నిర్వహించడం ద్వారా రాష్ట్రంలోని 21 బోధనాస్పత్రుల్లో కాకినాడ జీజీహెచ్ మొదటి స్థానంలో నిలిచింది. జూలైలో 9,580 మంది తల్లులకు, వారి సహాయకులకు 358 సెషన్లు నిర్వహించారు. ఆగస్టులో మొత్తం 586 సెషన్లు నిర్వహించగా, 12,026 మంది తల్లులు, వారి సహాయకులు హాజరయ్యారు. సెప్టెంబర్‌లో 700 సెషన్లతో రాష్ట్రంలో మరే ఆసుపత్రికీ సాధ్యం కాని మైలురాయిని అధిగమించారు. ఆ నెలలో 15,400 మంది సెషన్లకు హాజరయ్యారు. గడచిన మూడు నెలలుగా నర్సింగ్ సూపరింటెండెంట్ టీఎన్ కల్పనా మౌళి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రసవానంతరం వైద్య సేవలు పొందుతున్న మహిళలు, చంటి పిల్లలుండే అన్ని వార్డుల్లో సీసీపీపై అవగాహన కల్పిస్తున్నారు.
ఫ సీసీపీలో రాష్ట్రంలోనే మూడుసార్లు ఉత్తమ స్థానం
ఫ మాతా శిశు సంరక్షణలో కీలక భూమిక
సమన్వయంతో ఉన్నత స్థానం
జిల్లా కన్సెల్టెంట్ డాక్టర్ కార్తీక్ మార్గనిర్దేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఆధ్వర్యంలో పీడియాట్రిక్స్ హెచ్‌ఓడీ డాక్టర్ మాణిక్యాంబ పర్యవేక్షణలో, నా సమక్షంలో సీసీపీ నిర్వహిస్తున్నాం. మాస్టర్ ట్రైనర్లు నేకూరి శిరీష, నందికోళ్ల అనితాదేవి సహా కౌన్సిలర్లుగా నర్సులు కీలక పాత్ర పోషించారు. సమన్వయంతో రాష్ట్రంలోనే ఉన్నత స్థానం సాధించాం. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, మాతాశిశు మరణాల నివారణలో కీలక పాత్ర పోషిస్తాం.
– టీఎన్ కల్పన మౌళి,
నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్–1,
జీజీహెచ్, కాకినాడ
వాట్సాప్ ద్వారా సీసీపీ సేవలు
సీసీపీలో భాగంగా తల్లీబిడ్డల సంరక్షణకు మొబైల్ కేర్ కంపానియన్ సర్వీసెస్ (ఎంసీసీ) పేరిట వాట్సాప్ సేవలు అందిస్తున్నాం. వార్డులో ఉన్నప్పుడే వారిని నర్సులు స్కానర్ ద్వారా అనుసంధానం చేస్తారు. తల్లులు లేదా వారి సహాయకులు ఓ చిన్న వాట్సాప్ మెసేజ్ ద్వారా పూర్తి స్థాయి సేవలు పొందవచ్చు. మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నర్సింగ్ సూపరింటెండెంట్ కల్పన, కౌన్సిలర్ల హోదాలో నర్సులు కష్టం ఫలితంగానే జీజీహెచ్ రాష్ట్రంలోనే తొలి స్థానం సాధించింది. ఆ బృందానికి అభినందనలు.
– డాక్టర్ ఎస్.లావణ్యకుమారి,
సూపరింటెండెంట్, జీజీహెచ్, కాకినాడ
జీజీహెచ్ హ్యాట్రిక్
జీజీహెచ్ హ్యాట్రిక్


