జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు
కరప: జిల్లావ్యాప్తంగా సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు గుడి కేంద్రంగా కలసికట్టుగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆ సంస్థ జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు సూచించారు. పెనుగుదురులో ఆదివారం జరిగిన మండల సమరసత సేవా ఫౌండేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని ఆలయాల్లో ఫౌండేషన్ ఆధ్వర్యాన వారం వారం భజనలు, ప్రతి పౌర్ణమికి సామూహిక హారతులు, ఏకాదశి రోజున నగర సంకీర్తనలు, సత్సంగం, ధార్మిక జట్లు నిర్వహించాలని సూచించారు.
ప్రతి హిందువు ధర్మాన్ని ఆచరిస్తూ, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాలని కోరారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకూ గృహ సంపర్క సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం మండల సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులతో కలసి ఇంటింటికీ తిరిగి గృహసంపర్క సమావేశాలు నిర్వహించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, భజనల గురించి వివరించారు. జిల్లా బాల వికాస కేంద్రాల ప్రముఖులు గుండు విశ్వనాథం, యానాం కన్వీనర్ ముమ్మిడి చంటిబాబు, మండల కన్వీనర్ కాదా సత్యనారాయణ, మండల మహిళా కన్వీనర్ పేకేటి లక్ష్మీకాంతం, కె.వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.


