రావిచెట్టు వద్ద క్యూల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

రావిచెట్టు వద్ద క్యూల ఏర్పాటు

Nov 3 2025 7:14 AM | Updated on Nov 3 2025 7:16 AM

అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో ఉన్న రావిచెట్టు వద్ద ఆవు నేతి దీపాలు వెలిగించే మహిళల కోసం ప్రత్యేక క్యూలు నిర్మించారు. ‘భక్తులకేదీ అభయం’ శీర్షికన ‘సాక్షి’ ఆదివారం ప్రచురించిన కథనానికి దేవస్థానం అధికారులు స్పందించారు. ఈ కథనంలో అన్నవరం దేవస్థానంలో భద్రత గురించి ప్రస్తావిస్తూ.. ఆవు నేతి దీపాలు వెలిగించే మహిళలు రావిచెట్టు వద్దకు వెళ్లే దారి చాలా చిన్నదిగా ఉందని, అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించి, విశాలమైన మార్గం ఏర్పాటు చేయాలని ‘సాక్షి’ సూచించింది. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు రావిచెట్టు వద్దకు మహిళలు వెళ్లేందుకు మూడు వరుసల్లో క్యూ లైన్లు నిర్మించారు. అలాగే, దీపారాధన అనంతరం వెలుపలకు వచ్చేందుకు కూడా మరో మార్గం ఏర్పాటు చేశారు.

అయినవిల్లి ఆలయం కిటకిట

అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారు జామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 237 మంది పాల్గొన్నారు. ఏడుగురికి అక్షరభ్యాసాలు నిర్వహించారు. ఎనిమిది మందికి తులాభారం నిర్వహించారు. ఒకరికి నామకరణ చేయగా శ్రీ లక్ష్మీగణపతిహోమంలో 21 జంటలు పాల్గొన్నాయి. స్వామికి ఒక భక్తుడు తలనీలాలు సమర్పించారు. 40 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 4,860 మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.3,78,641 లభించినట్లు ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

అవార్డు నిరాకరించిన విద్యుత్‌ శాఖ ఏఈ

మలికిపురం: ఉత్తమ సేవలకు అవార్డు వస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా స్వీకరిస్తారు. అది అరుదుగా లభించే అవకాశం. అయితే అలా ఉత్తమ సేవలకు అవార్డుకు ఎంపిక అయిన మలికిపురం, సఖినేటిపల్లి మండలాల విద్యుత్‌ శాఖ ఏఈ బొలిశెట్టి ప్రసాద్‌ అవార్డు స్వీకరణకు నిరాకరించారు. ఇటీవల సంభవించిన పెను తుపానులో విశేష సేవలు అందించిన ప్రసాద్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి జిల్లా స్థాయి లో ఉత్తమ ఉద్యోగి అవార్డు స్వీకరణకు ఆహ్వానం వచ్చింది. శనివారం వెళ్లాలి. అయితే తుపానుకు దెబ్బతిన్న స్తంభాల పునరుద్ధరణ పనులలో సఖినేటిపల్లి మండలంలో విద్యుత్‌శాఖ ఎలక్ట్రీషియన్‌ యడ్ల శంకర్‌ ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. మనస్థాపానికి గురైన ప్రసాద్‌ తనకు ప్రకటించిన అవార్డు తీసుకునేందుకు నిరాకరించారు.

హిందువులు సంఘటితంగా ఉండాలి

గోకవరం: హిందూ దేవాలయాలు ఆర్థికంగా పరిపుష్టి కలిగి ఉండాలంటే హిందువులందరూ సంఘటితంగా ఉండాలని అహోబిల రామానుజ జీయర్‌ స్వామి అన్నారు. మండలంలోని గుమ్మళ్ళదొడ్డి శ్రీరామగిరి దేవాలయం వద్ద నూతనంగా నిర్మించిన పుష్కరిణి ప్రారంభోత్సవంలో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన రహదారి నుంచి కోలాటం, బాణసంచా కాల్పులు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనల నడుమ వల్మీక వేంకటేశ్వరస్వామి ఆలయం వరకూ ఊరేగింపుగా తీసుకువెళ్లారు. స్వామివారికి జీయర్‌ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరామగిరి చేరుకున్నారు. ఆలయం వద్ద లక్ష వత్తుల దీపం వెలిగించారు. తులసీధాత్రి పూజలో పాల్గొన్నారు. అనంతరం పుష్కరిణిని ప్రారంభించి, స్వామివారి తెప్పోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. కార్యక్రమంలో అర్చకులు, శ్రీ సీతారామ నామ సంకీర్తన సంఘం సభ్యులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

రావిచెట్టు వద్ద క్యూల ఏర్పాటు 1
1/2

రావిచెట్టు వద్ద క్యూల ఏర్పాటు

రావిచెట్టు వద్ద క్యూల ఏర్పాటు 2
2/2

రావిచెట్టు వద్ద క్యూల ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement