అన్నవరం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణస్వామి ఆలయానికి ఎప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది. మామూలు రోజుల్లోనే వేల సంఖ్యలో వచ్చే భక్తులు కార్తిక మాసంలో లక్షలకు పెరుగుతారు. ఈ నేపథ్యంలో దేవస్థానంలో భక్తుల భద్రతకు మరిన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలలోని 3, 10, 17వ తేదీల్లో కార్తిక సోమవారాల సందర్భంగా అనేక మంది విచ్చేస్తారు. ఈ నెల ఐదో కార్తిక పౌర్ణిమ అత్యంత కీలకం. ఆ రోజు సత్యదేవుని దర్శనానికి లక్ష మంది భక్తులు వస్తారని అంచనా. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సత్యదేవుని గిరిప్రదక్షణ జరగనుంది. గతేడాది ఆ కార్యక్రమంలో రెండు లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాగా..దేవస్థానంలో భక్తులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గంటల తరబడి క్యూలో నిలబడి ఆలయానికి వచ్చేటప్పటికి వారిలో సహనం తగ్గుతోంది. ఆలయంలో సిబ్బంది కదలండి అని తోస్తుంటే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులను క్యూలైన్ల కంపార్ట్‌మెంట్లలో కొద్దిసేపు కూర్చునేలా చేయాలి. ఆ సమయంలో వారికి మజ్జిగ, ఫలహారాలు, చిన్నారులకు బిస్కెట్లు, పాలు పంపిణీ చేస్తే కొంత సేద తీరే అవకాశం ఉంటుంది. రావిచెట్టు వద్ద ఆవునేతి దీపాలు వెలిగించేందుకు వెళ్లే మార్గం చాలా చిన్నదిగా ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను కొంత మేర తొలగించి విశాలంగా చేయాలి. దేవస్థానంలో చాలా చోట్ల భక్తులను కంట్రోల్ చేయడానికి బారికేడ్లు ఏర్పాటు చేసి వాటికి తాళాలు వేశారు. ఇది మంచిదే అయినా అత్యవసరమైనప్పుడు ఆ తాళాలు తీయడానికి సిబ్బంది అక్కడ ఉండడం లేదు. ఏదైనా తొక్కిసలాట జరిగినపుడు ఇది చాలా ఇబ్బందిగా మారింది. కార్తిక మాసం పర్వదినాలలో 108 అంబులెన్స్ రత్నగిరి మీదనే ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతం కొండదిగువన ఉంది.


