
ఆనందమీనందమాయె..
● మనసు దోచుకుంటున్న అక్వేరియం కల్చర్
● ఇంటి అలంకరణలో ప్రత్యేక స్థానం
● వాస్తు నమ్మకాలూ ఓ కారణం
రాయవరం: ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమిస్తారు. ఇప్పుడు ఇంటి అలంకరణలో అక్వేరియంలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇంటీరియల్ డెకరేషన్‌లో భాగంగా అక్వేరియం ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాకుండా సంస్కృతీ సంప్రదాయాలను పాటించేవారు, వాస్తుపరమైన నమ్మకంతో తమ సంపాదనను వృద్ధి చేసుకునే వారు, సుఖ సంతోషాలను పొందాలని నమ్మేవారు ఇప్పుడు చేపలను గాజు తొట్టె (అక్వేరియమ్స్)లో ఉంచుతున్నారు.
వ్యాపార సంస్థల్లోనూ..
అక్వేరియంలను ఇంటితో పాటు వ్యాపార సంస్థల్లో కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యాపారాభివృద్ధి కోసం వ్యాపారులు అక్వేరియంలను ఏర్పాటు చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, ఇళ్లల్లో స్థలానికి అవసరమైన ప్రమాణంలో అక్వేరియంలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. అందంతో పాటు, ఆదాయం వృద్ధి చెందుతుందని, వాస్తు దోషాలకు విరుగుడుగా ఉంటుందని నమ్మే వారు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే చిన్నపిల్లలు నీటిలో తిరిగే చేపలను చూడడానికి ఇష్టపడతారు. ఇంట్లో చిన్నపిల్లల కోరికను తీర్చేందుకు కూడా వీటిని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటున్నారు.
పెరుగుతున్న ఆసక్తి
అక్వేరియం ఏర్పాటు వెనుక కొన్ని వాస్తు నమ్మకాలు దాగున్నాయి. చైనీస్ వాస్తు ప్రకారం చేపలు అదృష్టానికి, నీరు సంపదకు గుర్తుగా భావిస్తారు. ఈ రెంటినీ కలిపి ఒకే చోట (అక్వేరియంలో) ఉంచుకుని సంపద వృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. చేపలు ఎప్పుడూ కళ్లు తెరిచే స్వభావాన్ని కలిగి ఉండడంతో మనకు జరగబోయే ఆటంకాలను ముందుగా గ్రహించి కదలికలతో సమాచారం అందిస్తాయనే నమ్మకం ఉంది. అధిక లాభాలను ఆర్జించవచ్చనే నమ్మకంతో వ్యాపార సంస్థలు సైతం అక్వేరియంలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అక్వేరియంల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది. అందుకు అనుగుణంగా స్వదేశీ, విదేశీ చేపలు నేడు మార్కెట్‌లో లభిస్తున్నాయి. దేశంలోని చైన్నె, కోల్‌కతా తదితర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దేశాల చేపలను కూడా వ్యాపారస్తులు విక్రయిస్తున్నారు.
ఉపాధికి మార్గంగా..
అక్వేరియంలో ఉంచేందుకు పలు రకాల చేపలను మార్కెట్‌లో అమ్మకాలు చేస్తున్నారు. స్కాట్‌ఫిష్, గోల్డ్‌ఫిష్, అరోవనా, రెడ్‌క్యాప్, గుప్పీస్, వైట్ ఏంజల్, బెలూన్‌ఫిష్, బ్లాక్‌గోల్డ్ ఫిష్, బ్లాక్ షార్క్, ఫ్లోరాస్, క్రోకడైల్ ఫిష్ వంటి 40 రకాల చేపలు లభిస్తున్నాయి. రూ.10 నుంచి రూ.20 వేల వరకు వివిధ ధరల్లో పలు రకాల చేపలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటితో పాటు పలు రకాల మోడళ్లలో అక్వేరియంలు కూడా లభ్యమవుతున్నాయి.