
రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌ల ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్‌మీనాకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భౌగోళికంగా కాకినాడకు అతి సమీపంలో ఉన్న రామచంద్రపురం నియోజకవర్గాన్ని కోనసీమ జిల్లాలో కలపడం సరికాదన్నారు. కోనసీమ జిల్లాకు రామచంద్రపురం నియోజకవర్గానికి మధ్యలో గోదావరి ఉండడం వల్ల ఏ అవసరమైనా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. యానం మీదుగా తిరిగి వెళ్లాల్సి రావడంతో అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కోనసీమ జిల్లా నుంచి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవాని, కె.గంగవరం ఎంపీపీ పంపన నాగమణి, రామచంద్రపురం మున్సిపల్ చైర్‌పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి, రామచంద్రపురం, కె.గంగవరం మండలాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
చిత్తశుద్ధితో సమస్యలు పరిష్కరించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రజా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి.వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా ప్రత్యేక అధికారి జి.వీరపాండ్యన్, జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మానీష, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, ఇతర జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వీటిపై విచారణ చేపట్టి తగిన పరిష్కారం చూపాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డుల మంజూరు, కార్డులలో పేర్ల మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూ వివరాలు ఆన్‌లైన్లో నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడికల తొలగింపు, పారిశుధ్యంపై అర్జీలు వచ్చాయి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఆన్‌లైన్ సమస్యలపై మొత్తం 517 అర్జీలు అందాయి. అనంతరం విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ నిధులతో 9 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ.45 వేల ఖరీదైన ల్యాప్‌టాప్‌లు అందించారు.
జిల్లాలో 2,72,497
మందికి పింఛన్ల పంపిణీ
పెదపూడి: ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా కింద అందిస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి జి.వీరపాండ్యన్ అన్నారు. రామేశ్వరంలో పేదలకు సేవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో వీరపాండ్యన్‌తో పాటు జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, డీఆర్డీఏ పీడీ జి.శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 2,72,497 మందికి రూ.117.66 కోట్ల విలువైన సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, డీఎంహెచ్‌ఓ జె.నరసింహనాయక్, ఎంపీడీఓ కొవ్వూరి నరేంద్రరెడ్డి, తహసీల్దార్ పీవీ సీతాపతిరావు తదితరులు పాల్గొన్నారు.
నగర పంచాయతీ
కమిషనర్ సస్పెన్షన్
ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ ఎం.సత్యనారాయణను సోమవారం సస్పెండ్ చేశారు. ఇటీవల ఏసీబీ అధికారులు చేసిన దాడిలో కమిషనర్ నగదుతో దొరికిపోవడంతో రాజహేంద్రవరం ఏసీబీ కోర్టుకు తరలించగా రిమాండ్ విఽధించారు. ప్రస్తుతం ఏఈ పి.సూర్యప్రకాశరావు ఇన్‌చార్జ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి