● జిల్లా అభివృద్ధిలో
చెరగని ముద్రవేసిన రాజన్న
● ఆనాడే పరుగులు పెట్టిన ‘పుష్కర’
● మెట్టలో జల‘తాండవ’ం
● నేడు మహానేత వైఎస్సార్ వర్ధంతి
రాజన్న.. ఆత్మీయ నేస్తం అయ్యారు.. అమృత హస్తం అందించారు.. జిల్లాలో సంక్షేమం పరవళ్లు తొక్కించారు.. అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు.. ప్రతి మదిలోనూ సుస్థిరమయ్యారు.. ‘వైఎస్’ పేరు చెబితేనే పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా కొనియాడుతున్నారు. ఆయన మన మధ్య లేకున్నా, చేసిన మేలు ఇప్పటికీ పదిలం చేసుకున్నారు.. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకంతో పరుగులు పెట్టించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఇప్పటికీ జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన చేసిన అభివృద్ధి ఫలాలను నెమరు వేసుకుంటున్నారు. మంగళవారం రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా జిల్లాలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు సిద్ధమవుతున్నారు.
– సాక్షి ప్రతినిధి, కాకినాడ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు పక్షపాతిగా, పేదల పెన్నిధిగా నిలిచారు. ఈ ప్రాంతానికి ఆయన చేసిన ప్రగతి జన హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. తన సుదీర్ఘ పాదయాత్రతో జిల్లాలో ప్రజల కష్టాలు, మెట్టప్రాంత రైతుల కన్నీళ్లు చూశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా వారి కష్టాలు గట్టెక్కించారు. ఆయన వేసిన అభివృద్ధి జాడలు ఇప్పటికీ చెక్కుచెదరని ఫలాలను అందిస్తున్నాయి. జిల్లాలోని ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, తుని తదితర నియోజకవర్గాల్లో మెట్ట ప్రాంత రైతుల కడగండ్లు తీర్చిన నేతగా జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇచ్చిన మాట ప్రకారం మెట్ట ప్రాంత పంటలకు తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ అందించారు.
సాగు.. భలే బాగు
జిల్లాలోని మెట్ట ప్రాంతంలో రెండు పంటలు సాగై రైతులు ఆనందంగా ఉంటున్నారంటే, ఆనాడు రాజశేఖరరెడ్డి సాకారం చేసిన ప్రాజెక్టులే కారణం. ఇప్పటికీ అవి పదిలంగా ఉన్నాయి. జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని తదితర నియోజకవర్గాల్లో వర్షాధారమైన పంట పొలాల్లోకి సాగునీరు పరుగులు పెట్టించారు. వర్షాలే ఆధారంగా దుక్కిదున్ని పంటలు సాగు చేసే పొలాల్లోకి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరు అందించి సిరులు కురిపించారు. అటు తుని నుంచి ఇటు జగ్గంపేట నియోజకవర్గం వరకూ బీడు భూములు కాస్తా సాగు భూములై బంగారం పండుతుందటంటే నాడు రాజన్న చేసిన మేలేనని రైతులు ఆనందంగా చెబుతున్నారు. వైఎస్ తమ కుటుంబాల్లో వెలుగులు నింపారంటూ చాలామంది తమ ఇళ్లలో వైఎస్ ఫొటోలు పెట్టుకుని అభిమానం చాటుతున్నారు. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన పుష్కర ఎత్తిపోతల పథకం వ్యవసాయం దిశ, దశనే మార్చేసిందంటే అది నాడు వైఎస్ చలవేనంటున్నారు. సుమారు లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించి వేలాది మంది రైతుల కడగండ్లు తీర్చిన తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకానికి వైఎస్ రూ.600 కోట్లు వెచ్చించి రైతుల కలను సాకారం చేశారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా మెట్ట రైతులకు రాజశేఖరరెడ్డి అపర భగీరథుడిగా నిలిచారు.
ఆనంద‘తాండవ’ం
సుమారు 30 వేల ఎకరాలకు పైగా ప్రయోజనం కల్పించే తాండవ ప్రాజెక్టును పూర్తి చేసి తుని పరిసర ప్రాంతాల రైతుల్లో ఆనందం నింపారు. రూ.52 కోట్లతో తాండవను ఆధునీకరించి కుడి, ఎడమ కాలువలు, పిల్ల కాలువలకు శాశ్వత పరిష్కారం చూపారు. ఇది తమ జీవితాలకు సిరుల పంట తెచ్చిందని కర్షకులు అంటున్నారు. తుని పరిధిలో తాండవ నదిపై భూమి, ముఠా మినీ ఆనకట్టలను రూ.5 కోట్లతో నిర్మించారు. తుని పట్టణ ప్రజలకు పుష్కలంగా తాగునీటి సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు.
బీడు నుంచి సాగుకు..
జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో సుమారు 10 వేల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతుందంటే, అది ఆనాడు మహానేత వైఎస్ చలవే. ఆ పది వేల ఎకరాల్లో ఏటా రెండు పంటలు సాగు చేసుకుంటున్నామని ఆ ప్రాంత రైతులు సంతోషంగా చెబుతున్నారు. జలయజ్ఞంతో ఏజెన్సీలోని రంపచోడవరంలో ముసురుమిల్లి ప్రాజెక్టు ద్వారా గోకవరం మండలంలో ఆయకట్టును సస్యశ్యామలం చేశారు. బీడు భూములను సాగులోకి తీసుకువచ్చారు. 2004లో ఎన్నికలకు ముందు గోకవరం వ చ్చిన వైఎస్ రైతుల కడగండ్లు చూసి చలించిపోయా రు. సీఎం అయ్యాక 22 వేల ఎకరాలకు నీరందించాలనే సంకల్పంతో రూ.205 కోట్లతో మొదలు పెట్టిన ప్రాజెక్టు పనులు దాదాపు 80 శాతం పూర్తి చేశారు.
ఆధునీకరించి.. చెరగని ముద్ర వేసి
2009లో రూ.132 కోట్లతో ఏలేరు ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. అపరిష్కృతంగా ఉన్న పిఠాపురం బ్రాంచ్ కెనాల్‌ను రూ.120 కోట్లతో ఆధునీకరించి తమ హృదయాల్లో చెరగని ముద్రవేశారని పిఠాపురం రైతులు పేర్కొంటున్నారు. కాకినాడలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి నాడు మహానేత సినిమా రోడ్డులో తీసుకువచ్చిన ఫ్లై ఓవర్ దోహదం చేసిందని గుర్తు తెచ్చుకుంటున్నారు. 2004లో సీఎంగా వైఎస్ తొలిసారిగా నగర బాటకు శ్రీకారం చుట్టింది కూడా కాకినాడ నగరంలోనే కావడం విశేషం. కాకినాడలో వేలాది మంది నిరుపేదల సొంతింటి కలను రాజీవ్ గృహకల్పతో సాకారం చేశారు. అందుకే రాజన్న ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని దక్కించుకున్నారు.
క‘న్నీళ్లు’ తుడిచి..
పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట, పెద్దాపురం జంట మున్సిపాలిటీల్లో లక్ష మంది దాహార్తిని తీర్చిన ఘనత దివంగత రాజశేఖరరెడ్డిదే. సుమారు రూ.15 కోట్లతో నిర్మించిన మంచినీటి ప్రాజెక్టులు ఆయన దార్శనికతకు నిలువుటద్దం. రూ.12 కోట్లతో పెద్దాపురం రాజీవ్ గృహకల్ప, రూ.25 కోట్లతో పేదల ఇళ్ల నిర్మాణానికి 13 ఎకరాలు కొనుగోలు చేసి మహానీయుడు అయ్యారు. వరద సమయంలో ముంపు, నీటి ఎద్దడి సమయంలో కరవుతో కటకటలాడిన ఏలేరు రైతుల కష్టాలు గట్టెక్కించిన రాజశేఖరరెడ్డి తమ హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగానే నిలిచిపోతారని ప్రజలు కొనియాడుతున్నారు.
ఆత్మీయ నేస్తం.. అమృత హస్తం
ఆత్మీయ నేస్తం.. అమృత హస్తం
ఆత్మీయ నేస్తం.. అమృత హస్తం