
సహజ వనరులు ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి
కాకినాడ రూరల్: రాష్ట్రంలో విలువైన సహజ వనరులను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతుందని, ఇందులో భాగంగానే కోస్టల్ కారిడార్‌ను దోచిపెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆరోపించారు. కాకినాడ 49వ డివిజన్ కొత్త గైగోలుపాడులో తన నివాసం వద్ద సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సముద్రపు ఇసుకలో పలు ఖనిజాలు వేరు చేసి ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందన్నారు. నెల్లూరు నుంచి ఇచ్చాపురం వరకూ సుమారు వందల కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, ఈ ప్రాంతంలో అత్యంత విలువైన ఖనిజ సంపద ఇప్పుడు కనుగొన్నారన్నారు. తీరంలో లభించే ఇసుకలో విలువైన ఇటాలియన్ ఖనిజాలు 8 రకాలుగా లభ్యమవుతాయని శాస్త్రవేత్తలు తేల్చారన్నారు. దేశంలోని బడా కంపెనీల కన్ను వీటిపై పడిందని, భీమిలి ప్రాంతంలో, శ్రీకాకుళం జిల్లా గార మండలంలో దాదాపు 900 ఎకరాలు, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 90 ఎకరాల్లో సముద్రపు ఇసుక తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. కేవలం రూ.2 వేల కోట్ల పెట్టుబడితో రూ.లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుకోవడానికి ప్రైవేట్ కంపెనీలు పోటీ పడుతున్నట్టు ఆమె తెలిపారు. ప్రైవేట్‌కు తక్కువకే కట్టబెట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం విరమించుకుని గ్లోబల్ టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుల భారం తగ్గే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా కేవలం 8 శాతానికి పరిమితమవ్వడం వెనుక సీఎం చంద్రబాబు హస్తం ఉందని భావించాల్సి వస్తుందన్నారు. గతంలో కృష్ణా, గోదావరి బేసిన్‌లో చమురు, గ్యాస్ వనరులను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి స్థానికంగా ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చలేదన్నారు. గుజరాత్‌కు గ్యాస్, చమురు తరలిపోగా, బ్లో అవుట్ ఇబ్బందులను స్థానికులు చవిచూశారన్నారు. ఇప్పుడు సముద్రపు ఇసుక ప్రొసెస్ వల్ల వచ్చే అధిక వేడితో స్థానికులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు.