
కొనసాగుతున్న వరద ఉధృతి
● ధవళేశ్వరం బ్యారేజీ వద్ద
13.10 అడుగుల నీటిమట్టం
● 11.79 లక్షల క్యూసెక్కుల మిగులు
జలాల విడుదల
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఎప్పటికప్పుడు మిగులు జలాలను దిగువకు విడిచిపెడుతున్నారు. సోమవారం ఉదయం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.10 అడుగులకు నీటి మట్టం చేరింది. అక్కడి నుంచి రాత్రి వరకు అదే స్థాయిలో కొనసాగుతోంది. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు స్వల్పంగా తగ్గుతున్నాయి. ఆ ప్రభావం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మంగళవారం కనిపించే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాటన్ బ్యారేజీలోని మొత్తం 175 గేట్లను ఎత్తి సోమవారం రాత్రి 11,79,236 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడిచిపెట్టారు. డెల్టా కాలువలకు సంబంధించి 13,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,900, మధ్య డెల్టాకు 2,300, పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 9.64 మీటర్లు, పేరూరులో 14.16 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.49 మీటర్లు, భద్రాచలంలో 43.40 అడుగులు, కూనవరంలో 19.53 మీటర్లు, కుంటలో 10.77 మీటర్లు, పోలవరంలో 12.69 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 16.46 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి.
లంక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని ఇరిగేషన్ ఎస్‌ఈ కూరెళ్ల గోపీనాథ్ తెలిపారు. వరద ఉధృతి ఈ నెల ఆరో తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. గత నెల 30న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామన్నారు. నదీ పరీవాహక, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు వరద సమాచారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గణేశ్ నిమజ్జనోత్సవాల సమయంలో నదిలోకి వెళ్లకుండా, ఒడ్డు నుంచే నిమజ్జనాలు చేయాలని సూచించారు. బలహీనంగా ఉన్న ఏటిగట్ల వద్ద ఇరిగేషన్, ఇతర శాఖల ద్వారా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలు మర పడవల్లో రేవులు దాటేటప్పుడు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలన్నారు. అక్టోబర్ చివరి వరకు వరద సీజన్ కొనసాగే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, తగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు.