
ఆదాయం.. గణనీయం
● అన్నవరం దేవస్థానంలో
హుండీల లెక్కింపు
● 32 రోజులకు రూ.1.69 కోట్లు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి శ్రావణమాసం సిరులు కురిపించింది. 32 రోజులకు గాను హుండీల ద్వారా రూ.1,69,06,902 ఆదాయం సమకూరింది. దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరిచి లెక్కించారు. ఇందులో నగదు రూ.1,59,69,547 కాగా, చిల్లర నాణేలు రూ.9,37,355 వచ్చాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. 32 రోజులకు సరాసరిన హుండీల ఆదాయం రూ.5.28 లక్షలుగా నమోదైంది. శ్రావణమాసం కావడం, వివాహాది శుభకార్యాలు గణనీయంగా జరగడంతో హుండీం ఆదాయం పెరుగుదలకు కారణమైందని అధికారులు తెలిపారు. ఈ హుండీల ద్వారా 39 గ్రాముల బంగారం, 765 గ్రాముల వెండి వచ్చింది.
విదేశీ కరెన్సీ కూడా...
సత్యదేవుని హుండీల ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. అమెరికా డాలర్లు 170, ఇంగ్లాండ్ పౌండ్లు 25, సింగపూర్ డాలర్లు ఐదు, ఆస్ట్రేలియా డాలర్లు పది, సౌదీ రియల్స్ పది, యుఏఈ దీరామ్స్ 455, ఖతార్ రియల్స్ 20, కెనడా డాలర్లు ఐదు లభించాయి.
మూడు నెలలుగా పెరుగుదల
మూడు నెలలుగా స్వామివారి హుండీల ఆదాయం గణనీయంగా పెరిగింది. సాధారణంగా స్వామివారి హుండీ ఆదాయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో నెలకు రూ.1.20 కోట్ల నుంచి రూ.1.50 కోట్ల వరకూ మాత్రమే వచ్చేది. భక్తుల రద్దీ తక్కువగా ఉండే రోజుల్లో ఈ ఆదాయం రూ. కోటి లోపు ఉండేది. అటువంటిది గత మూడు నెలల నుంచి స్వామివారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. జూన్‌లో హుండీ ఆదాయం రూ.2.12 కోట్లు, జూలైలో రూ.1.57 కోట్లు వచ్చింది. గత నెల రూ.1.69 కోట్లు వచ్చింది. గత ఏడాది ఈ మూడు నెలల హుండీ ఆదాయంతో పోల్చితే ఈ హుండీ ఆదాయం సుమారు 20 శాతం పెరిగింది. లెక్కింపులో దేవస్థానం చైర్మన్, ఈఓతో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆదాయాన్ని స్థానిక స్టేట్ బ్యాంకుకు తరలించారు.