
హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి
కాకినాడ సిటీ/జగ్గంపేట: జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు సంక్షోభంలో కూరుకుపోయాయని, సంక్షేమం పూర్తిగా కొరవడి సమస్యల వలయంలో చిక్కి విలవిలలాడుతున్నాయని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయ్యూరి నాని అన్నారు. విద్యార్థి సంఘం నాయకులతో కలసి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) జె.వెంకటరావుకు శుక్రవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో నాలుగు రోజుల పాటు విస్తృతంగా నిర్వహించిన సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంలో నిరుపేద ఎస్సీ, బీసీ, ఎస్టీ విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. నిధుల కొరత కారణంగా ఎక్కడా మెనూ సక్రమంగా అమలు జరగడం లేదన్నారు. పారిశుధ్యం క్షీణించిందని, నేలపై నిద్ర, దోమల స్వైరవిహారం సర్వసాధారణంగా మారాయన్నారు. నేటికీ దుప్పట్లు, దోమ తెరలు పంపిణీ చేయలేదన్నారు. పురుగుల బియ్యంతో వండిన ఉడికీ ఉడకని అన్నం, కుళ్లిపోయిన కూరగాయలతో పెడుతున్న ఆహారం తింటున్న విద్యార్థులు విషజ్వరాలు, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కాస్మెటిక్ చార్జీలు అందక విద్యార్థుల ఇక్కట్లు రెట్టింపయ్యాన్నారు. ప్రతి రోజూ ఇవ్వాల్సిన గుడ్లు, వేరుశనగ చిక్కీతో పాటు వారానికి రెండుసార్లు చికెన్ సైతం సరిగా అందడం లేదని చెప్పారు. అవసరమైనన్ని స్నానపు గదులు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు నరక యాతన అనుభవిస్తున్నారన్నారు. మౌలిక వసతులు లేక చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం మౌలిక వసతులు కల్పించాలని, మెస్ బిల్లులు, కాస్మెటిక్ చార్జీలు విడుదల చేయాలని, కేజీబీవీ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలని, విద్యాశాఖ అధికారులు వారంలో ఒక రోజు ప్రభుత్వ హాస్టళ్లలో నిద్ర చేయాలని నాని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయ్యూరి నాని, క్రిస్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్‌వెస్లీ, విద్యార్థి విభాగం నియోజకవర్గ, మండల అధ్యక్షులు నకిరెడ్డి సుధాకర్, మండపాక రవికుమార్, పార్టీ మండల, జగ్గంపేట టౌన్ అధ్యక్షులు రావుల గణేష్ రాజా, కాపవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.