
ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
సామర్లకోట: శ్రావణ మాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీ సమేత చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఆలయంలో ఏటా శ్రావణ శుక్రవారాల్లో సామూహిక వరలక్ష్మీ వత్రాలు నిర్వహిస్తూంటారు. దీనిలో భాగంగా ఈసారి రెండు, నాలుగు శ్రావణ శుక్రవారాల్లో మహిళలు సామూహిక వ్రతాలు చేసుకునేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. వ్రతాల్లో పాల్గొనే మహిళలు బియ్యం, కలశం, జాకెట్టు ముక్క తీసుకుని రాగా.. వ్రతాలకు కావలసిన వరలక్ష్మీ రూపు, ఫొటో, తోరాలు, గాజులు, పువ్వులు, తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు, కొబ్బరి కాయలు, ప్లేటు, ప్రమిదలు, ఒత్తులు, నూనెను దాతలు ఏర్పాటు చేశారు. దేవస్థానం సహకారంతో భక్తులకు ప్రసాదం అందజేశారు. సామూహిక వ్రతాలకు వచ్చిన మహిళలతో ఆలయం మొదటి అంతస్తు, దిగువన ఉన్న ఉపాలయాల ప్రాకారాలు నిండిపోయాయి. అధికారులు ఊహించని విధంగా సుమారు వెయ్యి మంది మహిళలు సామూహిక వ్రతాలు ఆచరించారు. ఈఓ బళ్ల నీలకంఠం, మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే బాబు లక్ష్మీదేవి చిత్రపటం వద్ద పూజలు చేసి వ్రతాలను ప్రారంభించారు. మంత్రాలు, పూజా విధానం, వ్రత కథ అందరికీ స్పష్టంగా వినిపించేలా మైకులు ఏర్పాటు చేశారు. వ్రతాల్లో పాల్గొన్న భక్తులకు దేవస్థానం ఆధ్వర్యాన అన్నదానం నిర్వహించారు. భక్తులకు భక్త సంఘం నాయకులు, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు సేవలందించారు. ఈ నెల 15న నాలుగో శుక్రవారంతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ముగుస్తాయని ఈఓ నీలకంఠం తెలిపారు. పాల్గొనదలచిన భక్తులు ఉదయం 9 గంటలకే ఆలయంలో ఉండాలని సూచించారు.

ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు