యంత్ర రాయితీకి చంద్రగ్రహణం | - | Sakshi
Sakshi News home page

యంత్ర రాయితీకి చంద్రగ్రహణం

Jun 7 2025 12:18 AM | Updated on Jun 7 2025 12:18 AM

యంత్ర

యంత్ర రాయితీకి చంద్రగ్రహణం

శనివారం శ్రీ 7 శ్రీ జూన్‌ శ్రీ 2025

10

లో

కూలీ రేట్లు పెరగడంతో

యంత్రాలపైనే ఆధారపడ్డ రైతులు

గత ఏడాది ఒక్క పరికరమూ

అందించని కూటమి ప్రభుత్వం

ఎక్కువ రేట్లు చెల్లించి పరికరాలు

అద్దెకు తెచ్చుకొంటున్న అన్నదాతలు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రైతులు సాంకేతికత సహాయంతో పంటలు పండించాలని చెబుతూనే యంత్ర రాయితీ పథకానికి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కారు మంగళం పాడింది. ఏటా రైతులకు 50 శాతం రాయితీపై యంత్రసేవా పథకంలో వ్యవసాయానికి సంబంధించిన యంత్ర పరికరాలు ఇవ్వాల్సి ఉంది. ఈ యంత్ర సేవా పథకానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేస్తుంది. రైతులకు విత్తు దగ్గర నుంచి వరి కోతల వరకూ వివిధ దశల్లో ఉపయోగపడే యంత్ర పరికరాలు ఈ యంత్ర సేవా పథకం ద్వారా అందజేయాల్సి ఉంది. దుక్కులు, దమ్ములు చేసుకొనేందుకు ట్రాక్టర్లు, డ్రమ్‌ ఫీడర్స్‌, రైతులు కోతలుకు వినియోగించే వరికోత యంత్రాలతోపాటు పలు పరికరాలు ఈ పథకంలో ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఒక్క రైతుకూ రాయితీ పరికరాలు ఇచ్చిన పాపాన పోలేదు. గత ఖరీఫ్‌, రబీ సీజన్‌లో రైతులకు కనీసం టార్పాలిన్‌లు, స్పేయర్లు కూడా పంపిణీ చేయకపోవడంతో అద్దెలకు తెచ్చుకొని పనులు చేసుకున్నారు. కాకినాడ జిల్లాలో సుమారు 2 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. జిల్లాలో 2.18 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా క్రమం తప్పకుండా రైతులకు, రైతు సంఘాలకు యంత్రసేవా పథకంలో రాయితీపై పరికరాలు అందించేవారు.

రెండు సీజన్లలో తప్పని అవస్థలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడచింది. ఖరీఫ్‌, రబీ సీజన్‌లు కూడా ముగిశాయి. కానీ రైతులకు కనీసం ఒక్క టార్పాలిన్‌, స్ప్రేయర్లు, వరికోత యంత్రాలు, మినీ ట్రాక్టర్లు, ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు వంటివి ఏమీ మంజూరు చేయలేదు. యంత్ర సేవా పథకంలో కేంద్ర ప్రభుత్వం నిధులు సైతం ఉన్నప్పటికీ అమలు కావడం లేదు. ఆ నిధులు ఏమీ చేశారో సీఎం చంద్రబాబునాయుడికే తెలియాలి. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే పథకాల నిధులు కూడా రైతులకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రతీ గ్రామంలో సుమారు రెండునుంచి మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఆయా గ్రామాల్లో సీజన్‌లో యంత్ర పరికరాలు లేకపోవడంతో వేరే ప్రాంతాల నుంచి పరికరాలు తీసుకొచ్చి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రైతులకు వరికోత యంత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. గత ఖరీఫ్‌, రబీ సీజన్‌లో తగిన యంత్రాలు లేకపోవడంతో ఒడిశా, బిహార్‌, పంజాబ్‌ వంటి రాష్ట్రాల నుంచి వరికోత యంత్రాలు అద్దెకు తెచ్చుకొవాల్సి వచ్చింది. గత రబీ సీజన్‌లో కోతలు కోసే సమయంలో వర్షసూచనల నేపథ్యంలో రైతులు యంత్రాలు లేక, కూలీలు లభించక చాలా అవస్థలు పడ్డారు. ఇదే అదనుగా పలువురు దళారులు వరికోత యంత్రాలు వేరే ప్రాంతాల నుంచి తీసుకువచ్చి అద్దెలు బాగా పెంచారు. ఎకరా పొలం వరికోత కోయడానికి రూ.3,500 చొప్పున వసూలు చేశారు. వరికోత యంత్రాలు స్థానికంగా అందుబాటులో ఉంటే రూ.2,500 తీసుకొనేవారు. వర్షసూచన నేపథ్యంలో ఎక్కువ రేటు పెట్టి అయినా సరే రైతులు కోతలు కోయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక రైతులు కోతలు పూర్తయిన తర్వాత ధాన్యం ఆరబోసుకొనేందుకు టార్పాలిన్‌ అవసరం. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం హయాంలో రైతులకు కావాల్సిన టార్పాలిన్‌లు 50 శాతం రాయితీపై అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఇవ్వకపోవడంతో అద్దెకు తెచ్చుకోవాల్సి వచ్చింది. వర్ష సూచన నేపథ్యంలో ఒక్కొక్క టార్పాలిన్‌కు రూ.50 చొప్పున అద్దె చెల్లించి తెచ్చుకోవాల్సి వచ్చింది. ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉంటే మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో సుమారు 10 రోజుల పాటు రైతులు ధాన్యాన్ని ఎండపెట్టాల్సి వచ్చింది. ఒక ఎకరం పొలంలో ధాన్యం ఎండపోసేందుకు ఐదారు టార్పాలిన్‌లు అవసరం కాగా వాటిని అద్దెకు తెచ్చుకోక తప్పలేదు. ఇలా కొందరు రైతులు 20 రోజుల వరకూ ధాన్యం తరలించకపోవడంతో వాటికి అద్దెలు చెల్లించాల్సి వచ్చింది. అదే ప్రభుత్వం రాయితీపై ఇస్తే ఆ టార్పాలిన్‌లు రైతులకు రెండు, మూడు సంవత్సరాల వరకూ వినియోగించుకొనే అవకాశం ఉంటుంది. అద్దె బాధ తప్పుతుంది. పురుగు మందులు పిచికారీ చేసే స్ప్రేయర్లు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేని దుస్థితిలో ఉంది. రైతులు గత ఖరీఫ్‌, రబీ సీజన్‌లో అద్దెకు తెచ్చుకొనే మందులు పిచికారీ చేసుకున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ మొదలైనా రాయితీ పరికరాల ఊసే ఈ ప్రభుత్వం ఎత్తడం లేదు.

గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల కొరత భారీగా ఉంది. గ్రామ ఆయకట్టుకు తగిన విధంగా కూలీలు గ్రామాల్లో దొరకడం లేదు. గతంలో వేరే ప్రాంతాల నుంచి కూలీలు వలసలు వచ్చి వరినాట్లు, వరి కోతలు, కలుపుతీత వంటి పనులు చేసేవారు. దీంతో కూలీల కొరత కొంతమేర తగ్గేది. ప్రస్తుతం వలస కూలీలు అసలు రావడం లేదు. దీంతో రైతులకు స్థానిక కూలీలతో పనులు చేయించుకోవడం కష్టసాధ్యమైపోయింది. ఈ నేపథం్యలో యంత్ర పరికరాలు ఉంటే రైతులకు ఎంతో మేలు చేస్తాయి. ఎకరం వరి కోత కోయాలంటే ప్రస్తుత కూలి రేటు ప్రకారం రూ.6 వేలు చెల్లించాలి. కుప్ప నూర్పిడికి ట్రాక్టరు, కూలీలకు మరో రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వరికోత యంత్రం ద్వారా అయితే రూ.3,500 సరిపోతుంది. ధాన్యం ఆరబోతకు టార్పాలిన్లు, కూలికి మరో రూ.3 వేలు ఖర్చవుతుంది. ఈ విధంగా రైతుకు రూ.6 వేలు మిగులుతుంది.

వైఎస్సార్‌ సీపీ హయాంలో..

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 2,431 రైతులకు, 150 రైతు సేవా సంఘాలకు రూ.27.52 కోట్లు విలువ చేసే యంత్ర సేవా పథకాలు క్రమం తప్పకుండా ఏటా అందజేశారు. గ్రామాల్లో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌లు ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన యంత్ర పరికరాలు తక్కువ రేట్లకు అద్దెకు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధానానికి కూడా కూటమి సర్కార్‌ స్వస్తి పలికింది. దీంతో రైతులు దళారుల వద్ద యంత్ర పరికరాలు తెచ్చుకొని అధికంగా అద్దెలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

యంత్రసేవా పథకం పునరుద్ధరించాలి

ఖరీఫ్‌, రబీ సీజన్‌లో ఈ యంత్ర పరికరాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో బయట నుంచి వచ్చే వరి కోత మెషీన్‌లపై ఆధారపడి కోతలు కోయడం వల్ల ఎకరాకు రూ.2 వేల వరకూ అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వం యంత్రాలు ఇస్తే మాకు భారం తగ్గుతుంది.

– అడబాల గోవిందు, రైతు వీకేరాయపురం, సామర్లకోట మండలం

టార్పాలిన్లు, స్ప్రేయర్లు ఇవ్వాలి

గత సంవత్సరం స్ప్రేయర్లు, టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాం. వీటి అద్దెలు రూ.2 వేలు చెల్లించాను. అదే ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తే రెండు, మూడు సంవత్సరాల వరకూ వీటిని వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం యంత్రసేవా పథకం పునరుద్ధరించాలి.

– ఎలుగుబంట్ల రవినాయుడు, రైతు కూరాడ, కరప మండలం

యంత్ర రాయితీకి చంద్రగ్రహణం1
1/4

యంత్ర రాయితీకి చంద్రగ్రహణం

యంత్ర రాయితీకి చంద్రగ్రహణం2
2/4

యంత్ర రాయితీకి చంద్రగ్రహణం

యంత్ర రాయితీకి చంద్రగ్రహణం3
3/4

యంత్ర రాయితీకి చంద్రగ్రహణం

యంత్ర రాయితీకి చంద్రగ్రహణం4
4/4

యంత్ర రాయితీకి చంద్రగ్రహణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement