ఇసుక లారీ ఢీకొని కౌలు రైతు మృతి
తుని రూరల్: తుని మండలం వి.కొత్తూరు గ్రామానికి చెందిన సూరెడ్డి రమణ (48)ను ఇసుక లారీ ఢీకొనడంతో మృతి చెందినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి తెలిపారు. మంగళవారం కౌలు రైతు అయిన సూరెడ్డి రమణ తుని రైతుబజారులో కూరగాయలు విక్రయించుకుని మోపెడ్‌పై స్వగ్రామానికి వస్తుండగా వెలంపేట వై.జంక్షన్‌లో రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఇసుక లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన రమణను తుని ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఘరానా దొంగ అరెస్టు
బనశంకరి: బెంగళూరులో చోరీలకు పాల్పడుతున్న ఏపీలోని తూర్పు గోదావరికి చెందిన ఘరానా దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల నగరంలో కొడిగేహళ్లిలో ఇంటి తాళం బద్దలు కొట్టి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. పోలీసులు గాలించి జేబీ నగరలో నివసించే గోదావరి వాసి కామేపల్లి శ్రీనివాస్ అలియాస్ కార్తీక్ (39)ను అరెస్ట్‌చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.9.20 లక్షల విలువచేసే 148 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 16వ తేదీన చోరీ చేసిన తరువాత ఓ ప్రైవేటు హాస్టల్‌లో మకాం వేశాడు. పోలీసులు సీసీ కెమెరాల చిత్రాలు, ఇతర ఆధారాల ప్రకారం పట్టుకున్నారు. కార్తీక్‌కు దొంగతనాలే వృత్తి అని, బీదర్, హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు 10 పోలీస్ స్టేషన్లలో పాత నేరస్తుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. కార్తీక్, మోహన్‌రుద్ర అనే పేర్లతో తిరుగుతూ చోరీలకు పాల్పడేవాడు. ఇతడిపై ల్యాప్‌టాప్, ఇళ్లలో చోరీలతో పాటు 88 కి పైగా కేసులు ఉన్నట్లు చెప్పారు.


