ఎర్రవల్లి: రైతులు ఉద్యానవన శాఖ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలను వినియోగించుకోవాలని ఉద్యానవన శాఖ డివిజన్ అధికారి ఇమ్రానా అన్నారు. సోమవారం మండలంలోని బీచుపల్లి ఆయిల్‌పాం నర్సరీలో వర్షాధార ప్రాంత అభివృద్ధిలో భాగంగా రైతులకు కూరగాయలు బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై కొండేరు, జింకలపల్లి గ్రామాలకు చెందిన 97 మంది రైతులకు రూ.6 లక్షల విలువ గల 1,746 కూరగాయల బుట్టలు పంపిణీ చేసి మాట్లాడారు. రైతులు వైవిధ్యమైన పంటలు సాగుచేస్తూ సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంభించి మెరుగైన ఆదాయాన్ని పొందేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎండీడీకేవై పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీని ద్వారా జిల్లాలో ఉద్యాన, పశు, మత్స్య తదితర రంగాలకు చెందిన లబ్ధిదారులు సైతం తమ వృత్తుల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. దీనిద్వారా రైతులు గ్రూపులుగా కలిసి వ్యవసాయాన్ని చేసి మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి లాభసాటిగా మార్చుకోవచ్చన్నా రు. కార్యక్రమంలో క్షేత్రస్థాయి ఉద్యానవన అధికారి అరుణమ్మ, సర్పంచులు ఈరన్న, మద్దిలేటి, ఉపసర్పంచ్ రాముడు, రైతులు పాల్గొన్నారు.


