ఎర్రవల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతిగా ఉంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దుద్దిళ్ల శ్రీపాదరావు చేసిన సేవలు మరువలేనివని పదో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పాణి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పదో బెటాలియన్‌లో దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభను నిష్పక్షపాతంగా, గౌరవప్రదంగా నడిపిస్తూ అధికార– విపక్షాలకు సమాన అవకాశాలు కల్పించిన నాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్నారు. శాసనసభ గౌరవం, నియమావళి పటిష్టతకు ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ప్రజల సమస్యలను శాసనసభలో బలంగా ప్రస్తావిస్తూ, సరళ జీవనం, ఉన్నత విలువల రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన మహనీయుడన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి ప్రజాసేవలో ముందుండాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు రాజేశం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


