‘అమ్మ’కు అక్షరం
● స్వయం సహాయక సంఘాల
మహిళలకు చదువు
● కొనసాగుతున్న అభ్యాసన కేంద్రాలు
గద్వాల న్యూటౌన్: మానవ జీవితంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో విద్య అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి ఒక్కరికీ కనీసంగా చదవడం, రాయడం నేర్చుకోవడం తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో ‘అమ్మకు అక్షర మాల’ పేరుతో నిరక్షరాస్యులైన స్వయం సహయక సంఘాల మహిళలను అక్ష్యరాస్యులుగా మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీనికి అనుగుణంగా జిల్లాలో నిరక్షరాస్యులను గుర్తించి, వలంటీర్ల ద్వారా వారికి చదవడం, రాయడం నేర్పిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో వారికి పరీక్షలు నిర్వహించనున్నారు.
ఎన్‌ఈపీ–2020 కి అనుగుణంగా పదిహేనేళ్లు పైబడిన వారికి విద్యను అందించడానికి కేంద్ర ప్రభుత్వం అండర్‌స్టాండింగ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్) పథకాన్ని తీసుకొచ్చింది. ఇదే సమయంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్)లోని వయోజన విద్యా విభాగం సైతం నిరక్ష్యరాస్యులకు చదువు చెప్పించేందుకు సిద్ధమైంది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో గ్రామీణాభివృద్ధి సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహయక సంఘాల నిర్వహణను చూస్తుంది. అయితే ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్న చాలా మంది మహిళలు నిరక్ష్యరాస్యులుగా ఉన్నారు. వీరికి కనీసంగా చదవడం, రాయడం, సంతకం చేయడం వంటివి అయినా ప్రభుత్వం నిర్ణయించింది.
పది మంది మహిళలతో ఒక స్వయం సహయక సంఘం ఏర్పాటవుతుంది. పదిహేను నుంచి ఇరవై సంఘాలతో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామైఖ్య సంఘం (వీఓఏ) ఏర్పాటవుతుంది. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో ఏరియా లెవెల్ ఫెడరేషన్ (ఏఎల్‌ఎఫ్) ఉంటుంది. ఇలా ఒక్కో గ్రామైఖ్య సంఘం.. ఏఎల్‌ఎఫ్‌ల కింద 150 నుంచి 200 మంది మహిళలు ఉంటారు. వీఓఏలను ఓబీలు, బుక్ కీపర్లు, ఏఎల్‌ఎఫ్‌లను ఓబీలు, ఆర్పీలు నిర్వహణ బాధ్యతలు చూస్తుంటారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఓబీలు, బుక్‌కీపర్లు, ఆర్పీల ద్వారా సెర్ప్, మెప్మా అధికారులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులను గుర్తించేందుకు గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ఉల్లాస్ అనే యాప్‌తో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో జిల్లాలోని 13 మండలాల పరిధిలో 60,805 మందిని, పట్టణ ప్రాంతాలకు సంబంధించి నాలుగు మున్సిపాలిటీల పరిధిల్లో 4,222 మంది కలిపి మొత్తంగా 65,127 మందిని నిరక్ష్యరాస్యులుగా గుర్తించారు.
నిరక్షరాస్యులను గుర్తించిన తర్వాత వారికి చదువు చెప్పేందుకు వీఓఏలు, ఆర్‌పీలు, ఓబీలను వలంటీర్లుగా నియమించారు. ఇందుకోసం డిసెంబర్‌లో రీసోర్స్‌పర్సన్లు వలంటీర్లకు శిక్షణ అందించారు. వయోజన విద్యాశాఖ ద్వారా వలంటీర్లకు, అభ్యాసకులకు వేర్వేరుగా ముద్రించిన బుక్ మెటీరియల్ అందించారు. ఈ మెటీరియల్ ఆధారంగా ఆయా గ్రామాలు, పట్టణాల్లోని ఇళ్లు, వీధులు, ఆలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర ముఖ్య స్థలాలను కేంద్రాలుగా చేసుకొని ఒక్కో వలంటీర్ సాయంత్రం వేళల్లో పది మందికి శిక్షణ ఇవ్వాలి. కార్యక్రమాన్ని గ్రామీణ స్థాయిలో సెర్ప్ అధికారులు సీసీలు, ఏపీఎం, డీపీఎంలు, పట్టణ ప్రాంతాల్లో సీఓలు, టీఎంసీలు, ఏడీఎంసీలు పర్యవేక్షిస్తున్నారు.
‘అమ్మ’కు అక్షరం


