
పాలమూరుపై బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం
కొల్లాపూర్: ‘పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయడంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.. ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ఉంటే రిజర్వాయర్లలో కృష్ణానీటిని నింపుకొనేవాళ్లం.. పాలమూరు ప్రాజెక్టుతోపాటు జిల్లాలోని జూరాల, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, కేఎల్‌ఐ ప్రాజెక్టుల్లోని పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తాం.. ఇందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామని’ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించి.. పలు విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణాలకు శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం రాజాబంగ్లా ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు లబ్ధిదా రులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు, రేషన్‌కార్డులు, రైతులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. కొల్లాపూర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 1980లో మల్లు అనంతరాములు నాగర్‌కర్నూల్ ఎంపీగా పోటీ చేశారని, తాను అప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా వ్యవహరించానని పేర్కొన్నారు. మధిర ప్రజలతో ఉన్న అనుబంధమే కొల్లాపూర్ ప్రజలతో నూ ఉందన్నారు. పాలమూరు బిడ్డ సీఎం రేవంత్‌రెడ్డి, కొల్లాపూర్‌తో అను బంధం ఉన్న తాను ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి మేరకు కొల్లాపూర్‌లో అడ్వాన్స్ టెక్నాలజీతో ఐటీఐ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. గతంలో తొలగించిన బ్యాంకులన్నింటినీ తిరిగి గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులతో మాట్లాడతామన్నారు. శ్రీశైలం నిర్వాసితుల అంశం ఆర్థిక పరమైనది కాబట్టి దీనిపై పరిశీలన చేసి చెబుతానన్నారు. ముంపు బాధితుల కోసం జూపల్లి కోరిన 3 వేల అదనపు ఇళ్ల గురించి కలెక్టర్లతో మాట్లాడి సమాచారం తెలుసుకొని తగిన న్యాయం చేస్తానన్నారు.
అభివృద్ధికి సహకరించండి: మంత్రి జూపల్లి
కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దికి సహకరించా లని మంత్రి జూపల్లి కృష్ణారావు డిప్యూటీ సీఎంను కోరారు. ఇక్కడ ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరు చేయాలని, శ్రీశైలం నిర్వాసితులకు పంచాయతీ కార్యదర్శి, లష్కర్ పోస్టులు ఇవ్వాలని, లేనిచో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్ష ల చొప్పున అదనపు పరిహారం చెల్లించాలని, నిర్వాసితుల కోసం నియోజకవర్గానికి అదనంగా 3 వేల ఇళ్లు మంజూరు చేయాలని విన్నవించారు.
డిజిటల్ బుక్స్ ఆవిష్కరణ..
ఐఐఎఫ్‌సీఎల్ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల కోసం రూపొందించిన డిజిటల్ బుక్స్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. వీటికి స హకరించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని ఆయ న అభినందించారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మేఘారెడ్డి, రాజేష్‌రెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, డీసీ సీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు జగదీశ్వర్‌రావు, ఒబేదుల్లా కొత్వాల్, సరిత పాల్గొన్నారు.
ప్రభుత్వాన్ని విమర్శిస్తే బుద్ధి చెప్పండి: ఎంపీ మల్లురవి
ముగ్గురు, నలుగురు సీఎంలు మారినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి.. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు జాతీయ రహదారి, సోమశిల– సిద్దేశ్వరం బ్రిడ్జిని మంత్రి జూపల్లి కృష్ణారావు సాధించారని ఎంపీ మల్లురవి అన్నారు. సీఎంను, డిప్యూటీ సీఎంను, మంత్రులను, ప్రభుత్వాన్ని ఎవరైనా అనవసరంగా విమర్శిస్తే వారికి కుక్కకాటుకు చెప్పుదెబ్బ తరహాలో బుద్ధిచెప్పాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రూ.899 కోట్లు కేటాయించాలని, పాలమూరు ప్రాజెక్టు పనులకు రూ.5 వేలు లేదా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కొత్తగా 50 గ్రామీణ లైబ్రరీలను సీఎస్‌ఆర్ ఫండ్స్ ద్వారా ఏర్పాటు చేయబోతున్నామని, అందులో 8 లైబ్రరీలు కొల్లాపూర్ ప్రాంతంలోనే ఉంటాయన్నారు.
అప్పుడే పూర్తి చేసి ఉంటే రిజర్వాయర్లలో కృష్ణానీళ్లు నింపుకొనేవాళ్లం
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల అసంపూర్తి పనులకు నిధులు కేటాయిస్తాం
అడ్వాన్స్ టెక్నాలజీతో ఐటీఐ ఏర్పాటు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

పాలమూరుపై బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం