
పర్యవరణాన్ని పరిరక్షించుకుందాం
అలంపూర్: పర్యవరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా జడ్జి ప్రేమలత అన్నారు. వనమహోత్సవంలో భాగంగా శనివారం అలంపూర్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అనంతరం జిల్లా జడ్జితో పాటు స్థానిక జూనియర్ సివిల్‌కోర్టు జడ్జి మిథున్ తేజను న్యాయవాదులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు, ఏపీపీ కార్తిక్ రాజ్, ఏజీపీ మధుసూదన్, ఎంఈఓ అశోక్‌కుమార్, న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: బేగంపేట, రామనంతాపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో 2025–26 విద్యా సంవత్సరం ఒకటో తరగతిలో డేస్కాలర్‌గా ప్రవేశాల నిమిత్తం జిల్లాలోని గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ అధికారి పవన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2018 జూన్ 1నుంచి 2019 మే 31వ తేదీ మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలను జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో పొందవచ్చన్నారు. దరఖాస్తుతో పాటు నివాస, కులం, ఆదాయం, జనన ధ్రువపత్రాల జిరాక్స్‌తో ఈ నెల 8వ తేదీలోగా జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. 12న లక్కీ డిప్ ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.
7న సీపీఐ జిల్లా మహాసభలు
గద్వాల: జిల్లా కేంద్రంలోని వాల్మీకి భవన్‌లో ఈ నెల 7న సీపీఐ జిల్లా 3వ మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.ఆంజనేయులు అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో మహాసభలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ దేశ సంపదను దోచిపెడుతోందని ఆరోపించారు. దేశ ఐక్యత, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని హాని తలపెడుతున్నారన్నారు. రాజ్యాంగ మూలాలను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే దళితులపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ వంటి నిత్యావసర ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో భవిష్యత్ పోరాటాలకు నాంది పలికేందుకు జిల్లా మహాసభల్లో పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రంగన్న, ఖాసీం, ఉప్పేరు కృష్ణ, ప్రవీణ్, రవి, రామాంజనేయులు, తిమ్మప్ప, గోకారి పాల్గొన్నారు.
ఇద్దరు పంచాయతీ
కార్యదర్శుల సస్పెన్షన్
గద్వాల: ఫేక్ డీఎస్‌ఆర్ అటెండెన్స్ నమోదు చేసిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది. మల్దకల్ మండలం విఠలాపురం, గట్టు మండలం బోయలగూడెం పంచాయతీ కార్యదర్శులు తిరుమలేశ్, శ్రీనివాసులును సస్పెన్షన్ చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. లైవ్ డీఎస్‌ఆర్ అటెండెన్స్ నమోదు చేయకుండా ఫేక్ డీఎస్‌ఆర్ నమోదు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
వేరుశనగ క్వింటాల్ రూ.6,100
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శనివారం 482 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 6,100, కనిష్టంగా రూ. 3,499, సరాసరి రూ. 5,090 ధరలు లభించాయి.

పర్యవరణాన్ని పరిరక్షించుకుందాం