
ఎక్కడి పనులు అక్కడే!
పురపాలికల్లో ప్రత్యేక అధికారుల పాలన మరో ఆర్నెళ్లు పెంపు
గద్వాలటౌన్: సర్కార్ మళ్లీ ప్రత్యేక పాలన పెంపునకే మొగ్గుచూపింది. ఇప్పటికే ఎక్కడి పనులు అక్కడే పడి వున్నా స్పందించేవారు కరవయ్యారు. తాజాగా మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారుల పాలన మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు మున్సిపాలిటీలకు ఉత్తర్వులు అందాయి. అయితే వచ్చే ఆరు నెలల్లో మున్సిపాలిటీల పనితీరు ఇంకా ఏమేరకు దిగజారుతుందన్నదే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న..? గత ఆరు నెలలుగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారి పాలన సాగుతుంది. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న గద్వాల మున్సిపాలిటీ పరిస్థితి మరింత దీనంగా తయారు కానుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పాలన నత్తనడకన సాగుతోంది. అభివృద్ధి పనులు మందగించాయి. గద్వాల మున్సిపాలిటీలో ప్రత్యేకాధికారి ముద్ర ఏమాత్రం లేదు. అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆయనతో పాటు కమిషనర్ దశరథ్‌పై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా పని చేస్తున్నాయి. నాయకులను కాదని ఆయన ఏ పనీ చేయలేకపోతున్నారు. సిబ్బంది కొరత కూడ ఆయన కాళ్లకు బంధాలు వేస్తోంది.
పడకేసిన పథకాలు..
అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు పనులను చూస్తే నత్తే నయమనిపిస్తుంది. డబుల్ బెడ్‌రూం ఇళ్ల అప్పగింత కాగితాలకే పరిమితం అయింది. ఇందిరమ్మ ఇళ్ల పురోగతి కనిపించడం లేదు. ఐదేళ్లు గడుస్తున్నా పట్టణ ఆడిటోరియం భవన నిర్మాణం పనుల ప్రారంభానికి మోక్షం లభించడం లేదు. రోడ్ల అభివృద్ధి, విస్తరణ అనేది మర్చిపోయారు. రింగ్‌రోడ్డు అభివృద్ధి ఊసేలేదు. కూరగాయల మార్కెట్‌తో పాటు ఇతర దుకాణాల నుంచి ఆదాయం లభించడం లేదు. ఐడీఎస్‌ఎంటీ దుకాణాల లీజు పూర్తయినా చర్యలు లేవు. ప్రకృతి వనాల నిర్వహణ గాడితప్పింది. అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నా నివారణ చర్యలు కనిపంచడం లేదు. పన్ను వసూళ్లపై రాజకీయ పెత్తనం కనిపిస్తుంది. ఇలా ఏది తీసుకున్నా అంగుళం కూడా ముందుకు కదల్లేదు. పథకాలన్ని ‘ఎక్కడవేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా మారాయి. పట్టణంలో ఏ సమస్యనైనా ఇది వరకు ప్రజలు తమ వార్డు కౌన్సిలర్ వద్దకు వెళ్లి మొరపెట్టుకునేవాళ్లు. చాలా సమస్యలు వాళ్ల స్థాయిలో పరిష్కారమయ్యేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం ప్రజలు తమ సమస్యలను కమిషనర్, ప్రత్యేక అధికారి దృష్టికే తీసుకువెళ్లాల్సి వస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. తాగునీటి సరఫరాలోనూ ఇబ్బందులతో పాట్లు తప్పడం లేదు. వార్డు ఆఫీసర్లు ఉన్నా వారికి మొక్కుబడి పనులే అప్పగిస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలో పట్టణంలో గొప్పగా చెప్పుకునే పథకం ఒక్కటీ లేదు.
అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా కానరాని నివారణ చర్యలు
పన్ను వసూళ్లపై రాజకీయనాయకుల పెత్తనం
పడకేసిన పథకాలు.. నత్తనడకన అభివృద్ధి పనులు
కనిపించని ‘ప్రత్యేక’ మార్క్