
క్రమశిక్షణతో చదివితే ఉజ్వల భవిష్యత్
మల్దకల్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు. మంగళవారం మల్దకల్ జెడ్పీహెచ్‌ఎస్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిష్ట్రర్‌లను పరిశీలించారు. గత ఏడాది పదో తరగతి ఫలితాలపై ఆరా తీసి ఈ ఏడాది వంద శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. అనంతరం పాఠశాల తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించి పిల్లల చదువుపట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ పీఎం శ్రీ పాఠశాలగా ఎంపికై న మల్దకల్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుని, ఉపాధ్యాయులను అభినందించారు. అదే విధంగా పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంఈఓ సురేష్, జిల్లా సెక్టోరియల్ అధికారి ఎస్తేర్‌రాణి, జాకీర్‌హుసేన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.