
లక్కీడిప్ ద్వారా విద్యార్థుల ఎంపిక
గద్వాల: బెస్ట్‌అవైలబుల్ పాఠశాలలో మిగిలిన సీట్లను నిబంధనల మేరకు లక్కీడిప్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసినట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు తెలిపారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో గ్రూప్–3లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు లేకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రూప్–1, గ్రూప్–2 నుంచి దరఖాస్తు చేసిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 20 మంది విద్యార్థులు ఎంపికై నట్లు తెలిపారు. వీరిలో 1వ తరగతిలో ఏడు మంది విద్యార్థులు, 5వ తరగతిలో 13మంది విద్యార్థులు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు తమ ధ్రువపత్రాలను తీసుకుని ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. లక్కీడిప్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ జిల్లా అధికారి నుషిత, కో–ఆర్డినేటర్ ఆంజనేయులు, కెజిబివి కన్వీనర్ హాంపయ్య, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.