
మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం
మల్దకల్: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మల్దకల్‌లో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా ఎమ్మెల్యే, కలెక్టర్ బీఎం సంతోష్, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నట్లు, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే నియోజక వర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోని మరింత అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలలో రైతుబంధు, రణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, రూ.500 కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు కరెంట్ ఉచితం, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను నిరుపేద ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
మహిళలు చదువుకోవాలి: కలెక్టర్
మహిళలందరు తప్పనిసరిగా చదువుకోవాలని అప్పుడే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మహిళల అర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం సోలార్ విద్యుత్ ప్లాంటు, మూడు బస్సులు, త్వరలో పెట్రోల్ బంకులతో పాటు ఇందిరా మహిళా శక్తి సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించి ఆదుకోవడం జరుగుతుందన్నారు. మండలంలోని నిరుపేదలకు 900 రేషన్‌కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. మండలంలోని మహిళా సంఘాలకు గత ఏడాది రూ.26 కోట్లు రుణంగా మంజూరు చేయగా ఈ ఏడాది రూ.72 లక్షలు వడ్డీ మాఫీ చేశామన్నారు. అంతకు ముందు జిల్లా స్థాయిలో ఉత్తమ పీఎం శ్రీ పాఠశాలగా ఎంపికై న మల్దకల్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీచైర్మన్ బండారి భాస్కర్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, తిమ్మారెడ్డి, సీతారామిరెడ్డి, సత్యారెడ్డి, విక్రమ్‌సింహరెడ్డి, రాజారెడ్డి, వీరన్న, నరేందర్‌గోపాల్‌రెడ్డి, తహసీల్దార్ ఝూన్సీరాణి, ఎంపీడీఓ సాయిప్రకాష్ , అధికారులు పాల్గొన్నారు.