భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సిబ్బందికి రక్షణ లేకుండా పోయిందని వైద్యసిబ్బంది ఆస్పత్రి ఎదుట బుధవారం నిరసనకు దిగారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేషెంట్లు, వారి అటెండర్లు సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నా.. భద్రతా సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆస్పత్రిలో భద్రతా ఏర్పాట్లు సక్రమంగా లేవని, సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయన్నారు. విధి నిర్వహణలో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, భయాందోళనల మధ్య పనిచేయాల్సి వస్తోందన్నారు. సిబ్బందికి రక్షణ కల్పించాల్సిన సెక్యూరిటీ వ్యవస్థ విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం పనిచేస్తున్న సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను తొలగించి, సమర్థవంతమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో పేషెంట్లు, అటెండర్ల కదలికలపై నిఘా పెంచడంతోపాటు సిబ్బందిపై దురుసు ప్రవర్తనకు అడ్డుకట్ట వేయాలని కోరారు. సిబ్బందికి పూర్తి భద్రత కల్పించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట నిరసన


