రిజర్వాయర్ పనుల అడ్డగింత
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా కాటారం మండల కేంద్రంలోని గారెపల్లి రిజర్వాయర్ వద్ద కొనసాగుతున్న పనులను మంగళవారం నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. పరిహారం తేల్చకుండా పనులు చేపట్టవద్దని జేసీబీ ఎదుట కూర్చొని పనులను నిలిపేశారు. తాము భూములు కోల్పోయి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పరిహారం అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. భూములు కోల్పోయి, పరిహారం అందక తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు వినలేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో రైతులు విష్ణు, రాజయ్య, ఆశయ్య, మల్లక్క, వెంకటమ్మ ఉన్నారు.


