తడిసి మోపెడు!
మూడో విడత..
డబుల్ ఖర్చులు..
ఖర్చులకు భయపడుతున్న ఆశావహులు
● గ్రామాల్లో ఎన్నికల
సందడి మొదలు
● గ్రామాల్లో దావత్‌లు,
మందు పార్టీల జోరు
● చివరి విడత ఆశావహులకు
తలకుమించిన భారం
● మొదటి విడత
నామినేషన్ల స్వీకరణ షురూ
కాళేశ్వరం: పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి దావత్‌లు, మందు పార్టీల కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఆశావహులు ఖర్చు చేస్తున్నప్పటికీ వారికి డబ్బుల టెన్షన్ పట్టుకుంది. మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత జరిగే ఎన్నికల అభ్యర్థులకు ఖర్చులు కలిసి వచ్చే అంశం కాగా చివరి విడత వారు అదనపు భారం మోయాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి నుంచి 20 రోజుల పాటు ఎన్నికల ప్రచారంతో పాటు క్యాడర్‌ను కాపాడుకునేందుకు వారి కోరికలు తీర్చడం లాంటి ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ఓటర్లను ప్రభావితం చేసే పెద్దలను, కుల, మహిళా సంఘాలు, యూత్ లీడర్లను మచ్చిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చుల అంచనా లెక్కలు చూసి ఆశావహులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంత ఖర్చయినా మంచిదే అంటూ డబ్బులు.. దారబోస్తే గెలువకపోతే ఎలా అనే భయం మరో వైపు కనబడుతోంది. గెలుపు గుర్రాలపై ప్రధాన పార్టీలు ఆరా తీయడంతో పాటు డబ్బులు ఖర్చు చేసే వారిని సంప్రదిస్తున్నారు. దసరా పండగ సమయంలో వేసిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌తో కూడా కొంత మంది ఆశావహుకులు డబ్బులు ఖర్చుచేసి రద్దు కావడంతో చేసేదేమీ లేక క్యాడర్‌ను కాపాడుతున్నారని తెలిసింది.
పరిమితికి మించి..
స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చులకు ఎన్నికల కమిషన్ వ్యయపరిమితిని విధించింది. ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడికి రూ.50 వేలు, ఐదు వేల కంటే తక్కువ జనాభా ఉన్న జీపీల్లో సర్పంచులు రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు 30 వేలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల అనంతరం ఖర్చులన్నింటినీ ఆధారాలతో సహా ఈసీకి సమర్పించాలి. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై అధికారుల నిఘా ప్రతినిత్యం ఉంటుంది. ఎన్నికల వ్యయానికి ఈసీ విధించిన పరిమితులకు మించి ఎనిమిది నుంచి పది రేట్ల వరకు ఖర్చులు ఉంటాయనేది బహిరంగ రహస్యమే అంటున్నారు.
జిల్లాలో ఇలా...
జిల్లాలో 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు, 2,102 వార్డులు ఉన్నాయి. మొత్తం 3,02,147 మంది ఓటర్లు ఉన్నారు. ఒకటో విడత డిసెంబరు 11న గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి, రెండో విడత డిసెంబరు 14న చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమెల మండలాలు, మూడో విడత డిసెంబరు 17న మంథని నియోజకవర్గంలోని మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం, కాటారం మండలాల్లో జరుగుతాయి. గురువారం నుంచి మొదటి విడత నామినేషన్ల స్వీకరణ మొదలైంది.ఆశావహుకులు ఖర్చులు కూడా మొదలు పెట్టారు.
రిజర్వేషన్.. స్థానాన్ని బట్టి ఖర్చులు
గ్రామ పంచాయతీ రిజర్వేషన్లను బట్టి ఎన్నికల ఖర్చులు మారనున్నాయి. జనరల్, బీసీ స్థానాల్లో ఖర్చు ఎక్కువ ఉండనుండగా, ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఒకింత తక్కువ ఖర్చు ఉండనుంది. ఈ సారి జనరల్ స్థానాలే ఎక్కువ ఉండటంతో ఆర్థికంగా బలంగా ఉన్నవారు పోటీ పడేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే పదవులు చేపట్టిన వారితో పాటు కొత్త వారు సైతం పోటీకి సై అంటున్నారు. గత ఎన్నికల్లోనే సర్పంచులుగా గెలిచేందుకు లక్షల్లో ఖర్చు చేయగా మళ్లీ ఈ ఎన్నికల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మూడో విడత ఎన్నికలు కాటారం, మహదేవపూర్, మల్హర్, మహాముత్తారం మండలాల్లో జరగనున్నాయి. మూడో విడతలో ఉన్న మండలాల జీపీల్లో ఆశావహులు ఇప్పటి నుంచి 20 రోజులకు పైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మొదటి విడత వారితో పోల్చుకుంటే వారి ఖర్చులు రెట్టింపు కానున్నాయని ఆశావహులు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే కొంత మంది పోటీలో ఉన్నామని బయటపడగా మరి కొంత మంది ఖర్చులకు భయపడి బయటకు రావడం లేదు. ఇప్పటికే ఆశవాహులు యూత్‌లీడర్లు, వార్డు లీడర్లకు పార్టీలకతీతంగా దావత్‌లు, పార్టీల్లో ముంచుతున్నారు. దీంతో ఖర్చులు తడిసిమోపడవుతున్నాయని తలలు పట్టుకుంటున్నారు.
తడిసి మోపెడు!
తడిసి మోపెడు!
తడిసి మోపెడు!


