అమల్లోకి పోలీస్‌యాక్ట్
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ యాక్ట్–1861 నిబంధనలు అమల్లో ఉంటాయని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ సిస్టమ్ వినియోగించవద్దని, శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక చర్యలు చేపట్టరాదన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్న నేపథ్యంలో, ప్రజలు పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాలన్నారు.
హత్య కేసులో శిక్ష
జిల్లాకేంద్రంలోని రాజీవ్‌నగర్‌కాలనీలో మద్యం మత్తులో భార్య, కుమారుడిని హత్య చేయడానికి ప్రయత్నించిన మార్త రాజేష్‌కు భూపాలపల్లి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి నాగరాజు గురువారం శిక్ష విధించినట్లు ఎస్పీ సంకీర్త్ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. 2023 మార్చి 13వ తేదీన మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాజేష్‌ను తాగవద్దని మందలిస్తున్న భార్య రమ, కుమారుడు ఉదయ్‌కుమార్‌పై గొడ్డలితో రాత్రి 11గంటలకు దాడి చేసి గాయపర్చినట్లు తెలిపారు. నేరం నిరూపితం కావడంతో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.5వేల జరిమాన విధించినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా లోతైన, సమగ్ర దర్యాప్తు నిర్వహించిన పోలీసు అధికారులను, కోర్టు కానిస్టేబుల్, సంబంధిత సిబ్బందిని అభినందించారు.
ఎస్పీని కలిసిన జీఎం
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ను గురువారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. ఈ సందర్భంగా ఏరియాలో సింగరేణి స్థితిగతులు, భద్రత ఏర్పాట్లను ఎస్పీతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్టేట్ అధికారి కార్తీక్, సెక్యూరిటీ అధికారి మురళీమోహన్, వెల్ఫేర్ అధికారి సాయికృష్ణ పాల్గొన్నారు.


