అయ్యయ్యో.. ‘చే’జారిందే! | - | Sakshi
Sakshi News home page

అయ్యయ్యో.. ‘చే’జారిందే!

Nov 28 2025 8:41 AM | Updated on Nov 28 2025 8:41 AM

అయ్యయ్యో.. ‘చే’జారిందే!

అయ్యయ్యో.. ‘చే’జారిందే!

అయ్యయ్యో.. ‘చే’జారిందే!

ఈ మూడింటిలో మంత్రి,

ఎమ్మెల్యేల మాటే చెల్లుబాటు..

ఆవేదనలో డీసీసీ పీఠం దక్కని ఆశావహులు

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపికపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు తమ పేర్లు సిఫారసు చేయకపోవడం వల్లే చాన్స్‌ చేజారిందని ఆశావహులు వాపోతుతుండగా, దరఖాస్తు చేసుకున్నా అవకాశం దక్కని సీనియర్‌లు అధిష్టానం తమపై చిన్నచూపు చూసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుల ప్రకటన వెలువడిన నాలుగైదు రోజులకు చాపకింది నీరులా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని ఆరు జిల్లాలకు గాను ఇద్దరు షెడ్యూల్‌ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్‌, ఒక షెడ్యూల్‌ తెగలకు చెందిన నాయకులకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. ఈ విషయంలో సామాజిక, సమన్యాయం పాటించినట్లు పార్టీ అధిష్టానం, సీనియర్లు చెబుతుండగా, సిఫారసులు ఫలించని, అవకాశం దక్కని నేతలు మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు అనుచరవర్గాలు చెప్తున్నాయి.

వరంగల్‌పై పోటాపోటీ సిఫారసులు..

వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్‌ అయూబ్‌కు అనూహ్యంగా అవకాశం దక్కిందని చెప్పొచ్చు. తూర్పు నియోజకవర్గంలో రెండు వర్గాలుగా పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ దంపతులు ఒక వర్గంగా, మిగిలిన నాయకులు మరో వర్గంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొండా దంపతులు మినహా మిగిలిన వారంతా డీసీసీ అధ్యక్షురాలిగా మాజీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణను ప్రతిపాదించారు. వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలతోపాటు ఆ నియోజకవర్గాలకు చెందిన నాయకులు కూడా స్వర్ణను ప్రతిపాదించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వర్ధన్నపేట నియోజకవర్గం ఏనుగల్లుకు చెందిన బొంపెల్లి దేవేందర్‌రావుకు డీసీసీ పదవీ ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. కొండా దంపతులు గోపాల నవీన్‌రాజుకు గానీ, లేని పక్షంలో మీసాల ప్రకాశ్‌కు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కాగా, మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్‌ అయూబ్‌ పేరును డీసీసీ అధ్యక్షుడిగా ఎవరు ప్రతిపాదించలేదు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌లకు సన్నిహితంగా, ఛత్తీస్‌గఢ్‌కు పార్టీ పరిశీలకుడిగా వెళ్లడంతో మీనాక్షి నటరాజన్‌ దృష్టిలో పడడం, మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ కోటాలో ఆయూబ్‌ పేరును చేర్చినట్లు తెలిసింది. మాజీలకు ఇవ్వొద్దని, కనీసం ఐదేళ్ల నుంచి పార్టీలో కొనసాగుతుండాలన్న నిబంధనలను పరిగణనలోకి తీసుకోవడంతో స్వర్ణ, నవీన్‌రాజులు అనర్హులయ్యారు. దీంతో మంత్రి కొండా సురేఖ దంపతులు, వారి అనుచరులు అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు.

మహబూబాబాద్‌లో ఎంపీ వర్గం..

జనగామలో ‘కొమ్మూరి’ వర్గం కినుక

జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా మహబూబాబాద్‌ ఎమ్మెల్యే మురళి నాయక్‌ భార్య ఉమకు కేటాయించడం పట్ల కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదవి ఆశించిన మరికొందరు అసంతప్తిగా ఉన్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు భరత్‌చందర్‌ రెడ్డి వర్గానికి దక్కడం పట్ల ఆయన వర్గం సంతోషంగా ఉంది. కానీ, ఎంపీ బలరాం నాయక్‌ వర్గానికి చెందిన నునావత్‌ రాధకు ఇవ్వకపోవడం పట్ల ఆయన అసంతప్తిగా ఉన్నట్లు అనుచరవర్గంలో చర్చ జరుగుతోంది. మొదటినుంచీ డీసీసీ అధ్యక్షుడు పదవి వస్తుందని భావించిన పీసీసీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్‌ రెడ్డి కూడా అసంతృప్తిగానే ఉన్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి అనుచరుడిగా ఉన్న గణపురం అంజయ్య కూడా అధ్యక్ష పదవి వస్తుందని ప్రచారం చేసుకున్నారు. అందరిని సమన్వయం చేసుకునేందుకు మురళి నాయక్‌ దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌గా పనిచేసిన లకావత్‌ ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్‌ను నియమించగా, మాజీ ఎమ్మెల్యే, మాజీ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఆయన అనుచరులు అసంతృప్తిలో ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. పార్టీ స్థాపించిన నాటినుంచి నేటివరకు ఒకే పార్టీలో ఉండడం లకావత్‌ ధన్వంతికి తగిన గుర్తింపు ఇచ్చిందన్న చర్చ జరుగుతుండగా, ఎస్టీ సామాజిక వర్గం, మహిళ కావడంతో గొడవలకు ఫుల్‌స్టాప్‌ పెట్టవచ్చని ఉద్దేశంతో ఆమెను జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పలువురు కూడా బలపరిచినట్లు ప్రచారం జరుగుతోంది.

ములుగు డీసీసీ అధ్యక్షుడిగా మళ్లీ పైడాకుల అశోక్‌కే చాన్స్‌ దక్కింది. ఈ విషయంలో మంత్రి సీతక్క సిఫారసు మేరకు ఆయనకు మరోసారి అవకాశం దక్కిందన్న చర్చ పార్టీలో ఉంది. పార్టీలోని ఒక్కరిద్దరు సీనియర్‌లు అసంతృప్తికి గురైనట్లు వారి అనుచరులు చెబుతున్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కుడా చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్‌లను నియమించడంలో ఎమ్మెల్యేల మాట చెల్లుబాటయ్యింది. భూపాలపల్లి నుంచి మాజీ మావోయిస్టు నేత గాదర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు ప్రయత్నించినా ఆయనకు చాన్స్‌ రాలేదు. హనుమకొండ నుంచి సుమారు 20మందికిపైగా ఆశించినా సీనియర్‌ నేత వెంకట్రాంరెడ్డికే అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పగించింది.

ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్షుల

ఎంపికపై మోదం, ఖేదం

పార్టీ సీనియర్‌లనుంచీ భిన్న స్వరాలు..

వరంగల్‌పై మంత్రి సురేఖ శిబిరంలో అసంతృప్తి?

మంత్రి సీతక్క అనుచరుడికే

మళ్లీ ములుగు పగ్గాలు..

హనుమకొండ, భూపాలపల్లిల్లో

ఎమ్మెల్యేల మాటే చెల్లుబాటు

మహబూబాబాద్‌ డీసీసీపై

ఎంపీ వర్గం కినుక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement