రోడ్డు నిర్మించాలని పూజారుల నిరసన
ఏటూరునాగారం: మండల పరిధిలోని కొండాయి– ఊరట్టం నుంచి మేడారం వెళ్లే రోడ్డును తక్షణమే నిర్మించాలని గోవిందరాజుల పూజారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు సారలమ్మ పూజారి కాక వెంకటేశ్వర్లు, గోవిందరాజుల పూజారులు దబ్బగట్ల గోవర్ధన్, రాజారాం, బాబు, జనార్ధన్, నాగేశ్వర్‌రావు, మాణిక్యం, చంద్రమౌళి, రాజు, రవి, వెంగళరావు, నాగరాజు ఆదివారం కొండాయి నుంచి ఊరట్టం మీదుగా మేడారం వెళ్లే రోడ్డును పరిశీలించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. కొండాయి బ్రిడ్జితో పాటు రోడ్డు మార్గాన్ని నిర్మిస్తేనే గోవిందరాజులను మేడారం జాతరకు తీసుకొస్తామన్నారు. సరైన రోడ్డు మార్గం లేక గోవిందరాజులును మేడారం తీసుకెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. మేడారం మహాజాతరకు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా రోడ్లు నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. పలుమార్లు ఈ విషయాన్ని అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మేడారం మహాజాతరకు రోడ్డు నిర్మాణం చేపట్టకుంటే గోవిందరాజులను మేడారం జాతరకు తీసుకెళ్లడం మానివేస్తామని హెచ్చరించారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
