ప్రైవేట్‌ కళాశాలల బంద్‌ బాట | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ కళాశాలల బంద్‌ బాట

Nov 3 2025 7:14 AM | Updated on Nov 3 2025 7:14 AM

ప్రైవ

ప్రైవేట్‌ కళాశాలల బంద్‌ బాట

ప్రైవేట్‌ కళాశాలల బంద్‌ బాట

కేయూ పరిధిలో 240 కళాశాలలు..

నేటి నుంచి కాలేజీలు మూసివేయాలని యాజమాన్యాల నిర్ణయం

కళాశాలలను నడపలేకపోతున్నాం..

కేయూ క్యాంపస్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్‌ కళాశాలలు సోమవారం నుంచి బంద్‌ బాట పట్టనున్నాయి. గతంలో ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కళాశాలలు, ప్రొఫెషనల్‌ కోర్సుల యాజమాన్యాలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. కళాశాలలను మూసివేసి ఆందోళన కూడా చేశాయి. అసెంబ్లీలో కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పలువురు ప్రజాప్రతినిధులు లేవనెత్తారు. విడతల వారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా కూడా జాప్యం జరుగుతూనే ఉంది. టోకెన్లు ఇచ్చిన కళాశాలల యాజమాన్యాలకు తొలుత రూ.1200 కోట్లు ఇస్తామని చెప్పి దసరా ముందు ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసింది. మిగిలిన రూ.900 కోట్లు విడుదల చేయలేదు.

విజిలెన్స్‌ తనిఖీకి ప్రభుత్వం నిర్ణయం

మరోవైపు ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌ డిగ్రీ, పీజీతో సహా ప్రొఫెషనల్‌ కాలేజీలను విజి లెన్స్‌ అధికారులతో తనిఖీలు చేసేందుకు ఇటీవల జీఓ జారీ చేసింది. కళాశాలల్లో విద్యార్థులకు సదుపాయాలున్నాయా, బోగస్‌ విద్యార్థులున్నారా, ని బంధనలకు అనుగుణంగా కళాశాలలను నడుపుతున్నారా, అధ్యాపకులు ఉన్నారా తదితర వాటిని కూడా తనిఖీ చేసేందుకు నిర్ణయించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకుంటే కళాశాలలను బంద్‌ చేస్తామని ప్రకటించాక ప్రభుత్వం విజి లెన్స్‌ తనిఖీలు చేయిస్తామని జీఓ జారీ చేయడం కక్ష సాధింపు లాంటిదేనని కళాశాలల యజామాన్యాల అసోసియేషన్లు మండిపడుతున్నాయి.

డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు ఆలస్యం

కేయూ పరిధిలో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 3వ వరకు గడువు ఉంది. ఈనెల మూడో వారం లేదా ఆ తర్వాత పరీక్షలు నిర్వహించాలనే యోచనలో పరీక్షల విభాగం అధికారులున్నారు. అయితే, ఈనెల 3వతేదీ నుంచే కళాశాలలు నిరవధికంగా బంద్‌ చేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌కు కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, బాధ్యులు వేణుమాధవ్‌, రవీందర్‌రెడ్డి, హరీందర్‌రెడ్డి తదితరులు ఈనెల ఒకటిన సమ్మె నోటీస్‌ అందజేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేసేవరకు కళాశాలలను మూసివేస్తామని, పరీక్షలు కూడా నిర్వహించమని స్పష్టం చేశారు. దీంతో డిగ్రీ మొదటి, రెండు, మూడో సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెలలో నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చునని భావిస్తున్నారు. మరోవైపు విద్యార్థులకు ఆయా సెమిస్టర్ల సిలబస్‌ కూడా పూర్తికాలేదని తెలుస్తోంది. దీంతో పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కళాశాలల యాజమాన్యాలు ఈనెల ఒకటిన అధికారులకు సమ్మెనోటీస్‌ కూడా అందజేశాయి. కేయూ పరిధిలో 240 వరకు ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కళాశాలలు, లక్ష మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. అలాగే, మూడు ఇంజనీరింగ్‌ కళాశాలలు, 24 ఫార్మసీ కళాశాలలు, 42 విద్యాకళాశాలలు, రెండు లా కళాశాలలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ కళాశాలలకు రూ.వందకోట్లకు పైగానే బకాయిలు రావాల్సి ఉందని యాజమాన్యాల అసోసియేషన్‌ బాధ్యులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌

కాకతీయ యూనివర్సిటీ అధికారులకు సమ్మె నోటీస్‌

డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణలోనూ ఇక జాప్యమే

ఒప్పుకున్న మేరకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించాలి. రూ.1200 కోట్లలో రూ. 300 కోట్లు చెల్లించింది. మిగిలిన రూ.900 కోట్లు చెల్లించాలి. ఆతర్వాత ఇంకా చాలా బకాయిలున్నాయి వాటిని దశలవారీగానైనా చెల్లించవచ్చునని చెప్పాం. అయినా ప్రభుత్వం చెల్లించడం లేదు. ఆర్థికపరమైన ఇబ్బందులతో కళాశాలలను నడపలేకపోతున్నాం. తప్పనిపరిస్థితుల్లోనే కళాశాలలను నిరవధికంగా బంద్‌ చేస్తున్నాం.

– ఉపేందర్‌రెడ్డి, ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కాలేజెస్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ కేయూ అధ్యక్షుడు

ప్రైవేట్‌ కళాశాలల బంద్‌ బాట1
1/1

ప్రైవేట్‌ కళాశాలల బంద్‌ బాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement