సుందరీకరణ పనులేవి?
జంపన్నవాగు డెవలప్‌మెంట్‌కు రూ. 5 కోట్లు మంజూరు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని జంపన్నవాగు భక్తులకు ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా కనిపించేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు రూ. 5 కోట్ల నిధులను మంజూరు చేసింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మహాజాతర నాటికి జంపన్నవాగును సుందరంగా తీర్చిదిద్ధి భక్తులకు సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్కలు జాతర అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జంపన్నవాగును సుందరీకరించనున్నట్లు చెప్పారు. కానీ రోజులు గడుస్తున్నా నేటి వరకు పునరుద్ధరణ పనులు చేపట్టలేదు.
మహాజాతరకు 87 రోజులే..
మేడారం మహాజాతరకు ఇంకా 87 రోజుల సమ యం మాత్రమే మిలిగింది. జాతరకు వచ్చే భక్తులు తొలుత జంపన్నవాగులో, స్నానఘట్టాల వద్ద ఉన్న బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ కింద పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. ఈ సారి జాతరకు వచ్చే భక్తులకు జంపన్నవాగు పరిసరాలను పర్యాటక పాయింట్ ప్రదేశంగా మార్చేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు కాసేపు గడపేందుకు షెడ్ల నిర్మాణంతో పాటు పిల్ల ల పార్కు, బెంచీల ఏర్పాటుతో పాటు కొత్తదనం ఉట్టిపడేలా అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల మేడారం జాతర పనులపై ఏర్పాటు చేసిన సమీక్షలో జంపన్నవాగు ఇరువైపులా పది వేల మంది భక్తులు సేదతీరేలా షెడ్ల నిర్మాణం ఏర్పాటు చేస్తామని మంత్రులు చెప్పినా పనులు మొదలు కాకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జంపన్నవాగును సుందరీకరిస్తే జాతరకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ అధికారులు ఆ దిశగా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ప్రశ్నగా మారింది.
ముందస్తుగా భక్తుల తాకిడి
మేడారానికి భక్తుల తాకిడి పెరగనుంది. ఈ సారి జాతర ముందుస్తుగా జనవరిలో రావడంతో అమ్మవార్ల దర్శనానికి భక్తులు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతిఏటా మహాజాతరకు రెండు నెలల ముందు నుంచే మేడారానికి భక్తుల తరలివస్తుంటారు. ఇప్పటికే ఆది, బుధ, గురు, శుక్రవారాల్లో భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. అంతేకాకుండా సంక్రాంతి సెలవులకు సైతం వనదేవతల దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు.
అయినా పనుల గురించి
పట్టించుకోని టూరిజం శాఖ
మేడారం మహాజాతరకు
మిగిలింది 87 రోజులే..


