బేరసారాలు..
ఒక్కో దగ్గర ఒకలా..
లక్కీ డ్రాలో మద్యం షాపులు దక్కిన వారికి డిమాండ్
భూపాలపల్లి: మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి కావడంతో కొత్తగా మద్యం షాపు దక్కించుకున్న వారితో వ్యాపారులు బేరసారాలకు దిగారు. నజరానా ఇస్తాం.. షాపు ఇస్తారా.. అంటూ ప్రలోభపెడుతున్నారు. గతంలో మద్యం వ్యాపారంలో ఉండి, ఈసారి షాపులు దక్కని వారు ఎలాగైనా దుకాణాలను దక్కించుకొని రంగంలో ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. లక్కీ డ్రాలో దుకాణాలు వరించిన వారిని మచ్చిక చేసుకొని రూ.లక్షల్లో నజరానా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కొత్త, పాత వ్యాపారుల మంతనాలు కొనసాగుతున్నాయి.
ఒక్కో షాపులు రూ.80 లక్షల వరకు..
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 59 మద్యం దుకాణాలు ఉండగా ఎకై ్సజ్ అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. గత కొన్నేళ్ల నుంచి ఈ వ్యాపారంలో ఉన్న వారు ఈ సారి 50 నుంచి 100 వరకు దరఖాస్తులు వేశారు. అయినప్పటికీ కొందరికి దుకాణాలు దక్కలేదు. దీంతో షాపులు దక్కిన వారితో మంతనాలు జరుపుతున్నారు. ఒక్క షాపుకు రూ.80 లక్షల వరకు గుడ్‌విల్ ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. ఇందుకు పలువురు వ్యాపారులు లొంగిపోయి షాపులను వారికి అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
సిండికేటుకు ప్రయత్నాలు..
మద్యం దుకాణాలను దక్కించుకున్న, గుడ్‌విల్ ఇచ్చి కొనుగోలు చేసిన వారు.. వెచ్చించిన డబ్బులను రాబట్టుకునేందుకు సిండికేటుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఇప్పటికే ఒక ఒప్పందానికి వచ్చి బెల్టుషాపులకు అధిక ధరలకు విక్రయించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
మందుబాబుల జేబులకు చిల్లు..
సిండికేటు దందాతో గ్రామాల్లోని మందుబాబుల జేబులు చిల్లులు పడనున్నాయి. ఒక్కో క్వార్టర్, బీరుకు సిండికేటు వ్యాపారులు రూ. 20 అదనంగా తీసుకోనుండటంతో బెల్టుషాపులు యజమానులు మరో రూ. 20 అదనంగా తీసుకోనున్నారు. ఫలితంగా ఒక్కో క్వార్టర్, బీరుపై రూ.40 ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది.
జిల్లా కేంద్రంలో 8 మద్యం షాపులు ఉండగా, గతంలో మాదిరిగానే సిండికేటుగా ఏర్పడనున్నట్లు తెలిసింది. ఎటువంటి గొడవలు చోటుచేసుకోకుండా ఉండేందుకై 8 షాపుల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎమ్మార్పీ ధరకు మద్యాన్ని విక్రయించనున్నారు. కాగా అందరూ కలిసి ఒక గోడౌన్‌ను ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి బెల్టుషాపులకు మద్యం సరఫరా చేస్తారు. ఒక్కో క్వార్టర్, బీరుపై అదనంగా రూ.20 తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా భూపాలపల్లి పట్టణంలోని బాంబులగడ్డ, సీఆర్ నగర్‌లో ఇటీవల విచ్చలవిడిగా బెల్టుషాపులు వెలిశాయి. ఆయా బెల్టుషాపుల యజమానులు సిండికేటు నుంచి కాకుండా మద్యంషాపుల నుంచి ఎమ్మార్పీ ధరలకు మద్యాన్ని కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. దీంతో సిండికేటు ఆదాయానికి గండి పడుతుంది. ఈ విషయాన్ని గమనించిన మద్యం వ్యాపారులు ఈసారి పాత జంగేడు రోడ్‌లో ఉన్న బ్రాందీషాపును బాంబులగడ్డలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
కాళేశ్వరంలో రెండు బ్రాందీషాపులు ఉండగా మందుబాబులకు రిటైల్ ధరలకు, బెల్టుషాపులకు అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు.
రేగొండ మండలకేంద్రంలో మూడు షాపులు ఉండగా రెండింటిలో విక్రయాలు జరుపుతూ, ఒక షాపును పూర్తిగా బెల్టుషాపులకు, టేకుమట్లలో రెండు షాపులు ఉండగా ఒక షాపులో మాత్రమే మద్యం విక్రయాలు జరుపుతూ, మరోషాపులో బెల్టుషాపులకు మాత్రమే మద్యం విక్రయించనున్నట్లు తెలిసింది. మొగుళ్లపల్లి, కాటారం మండల కేంద్రాల్లో సైతం ఇదే తరహాలో దందా సాగించనున్నట్లు సమాచారం.
రూ.లక్షలు ఆఫర్ చేస్తున్న వ్యాపారస్తులు
రెండేళ్లకు గాను భారీ నజరానా
మరోవైపు సిండికేటుకు యత్నాలు
బేరసారాలు..


