
వృత్తి నైపుణ్యంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
భూపాలపల్లి: వృత్తి నైపుణ్యంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్‌లో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాల అడ్మిషన్లకు సంబంధించిన వాల్‌పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నైపుణ్యానికి నాణ్యతను అందించే కేంద్రాలు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలన్నారు. యువత జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) ఆధ్వర్యంలో 2025–26/27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ నూతన కోర్సులను ప్రారంభించినట్లు తెలిపారు. ఏటీసీ, ఐటీఐలో ప్రవేశాలకు 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ప్రభుత్వ ఏటీసీ భూపాలపల్లి కార్యాలయంలో లేదా 89851 00563 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యుడు, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజేంద్రప్రసాద్, సహాయ కార్మిక అధికారి నారాయణస్వామి, ఆర్డీఓ రవి, భూపాలపల్లి ఏటీసీ ప్రిన్సిపాల్ జుమ్లానాయిక్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు..
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు.
సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి 59 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు నిశితంగా పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి పాల్గొన్నారు.
ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
గణపురం: జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని.. ఎవరైనా కావాలని ఎరువుల కొరత సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ హెచ్చరించారు. గణపురం మండలకేంద్రంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల దుకాణాన్ని ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాముల్లో ఎరువులు, విత్తన స్టాక్ బోర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎరువుల సమస్య వస్తే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 89777 41771, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 78930 98307 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, జిల్లా సహకార అధికారి వాల్య నాయక్, మండల వ్యవసాయ అధికారి అయిలయ్య పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్

వృత్తి నైపుణ్యంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు