
నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
గణపురం: గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో శనివారం విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కాకతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని మొదటి దశ 500 మెగావాట్లలో ఉదయం నుంచి విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ప్రధాన ప్లాంటులోని బాయిలర్ ట్యూబ్ లీకేజీతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు కేటీపీపీ అధికార వర్గాలు తెలిపాయి. మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయని త్వరలోనే విద్యుత్ పునరుత్పత్తి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
మల్హర్: ఐదు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌లోకి భారీగా వర్షపు నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓపెన్‌కాస్ట్‌లో రోజుకు లక్ష మెట్రిక్ టన్నుల ఓబీ, ఆరు వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ జనరల్ మేనేజర్ కేఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా మైన్ మొత్తం బురదమయంగా మారి వాహనాలు కదలని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. దీంతో 30వేల మెట్రిక్ టన్నుల బొగ్గు, 5లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయని వెల్లడించారు.
పకడ్బందీగా పారిశుద్ధ్య పనులు
మల్హర్: మండలంలోని పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) వీరభద్రయ్య ఆదేశించారు. మండల కేంద్రం తాడిచర్లలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను డీపీఓ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా గ్రామాల్లోని ప్రతీ వార్డులో చెత్తాచెదారంతో పాటు మురుగునీరు నిలువ ఉండకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ వేయాలని తెలిపారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్‌రెడ్డి, పంచాయయతీ కార్మికులు ఉన్నారు.
నేడు కేటీఆర్ రాక
భూపాలపల్లి: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు నేడు(ఆదివారం) జిల్లాకు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చేరుకొని మాజీ సర్పంచ్ కొడారి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మొగుళ్లపల్లి మండలకేంద్రంలోని శ్రీ లక్ష్మిసాయి గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. అనంతరం చిట్యాల మీదుగా జిల్లాకేంద్రానికి చేరుకొని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతారు. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు.
పరీక్ష ఫీజు చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: ఓపెన్ ఇంటర్, టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజులను ఆగస్టు 5వ తేదీలోపు చెల్లించాలని జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శనివారం ఒక ప్రకట నలో పేర్కొన్నారు. గతంలో పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత పొందని వారు, గత సంవత్సరంలో ప్రవేశం పొంది పరీక్ష రాయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రూ.25 అపరాధ రుసుంతో ఆగస్టు 10వ తేదీలోపు, రూ.50 అపరాధ రుసుంతో 15వ తేదీలోపు తత్కాల్ ఫీజుతో 18వ తేదీలోపు ఫీజు చెల్లించాలని కోరారు.
బ్యాంకు ఖాతాలను మార్చుకోవాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్న బ్యాంకులకు తమ ఖాతాలను మార్చుకోవాలని ఏరియా అధికార ప్రతినిధి మారుతి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల బీమా సౌకర్యం కల్పనపై గతంలో వివిధ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఏరియాలో పనిచేస్తున్న ఉద్యోగులు 323 మంది బీమా సౌకర్యం కలిగిన బ్యాంకులో ఖాతాలు తీసుకోవాలని కోరారు.

నిలిచిన విద్యుత్ ఉత్పత్తి