చిట్యాల: మండలంలోని జూకల్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇంద్రపాల శైలేంద్రనాథ్ (పదవ తరగతి), మామునూరి నిశాంత్(ఎనిమిదవ తరగతి), జంపుల సౌమిత్ (పదవ తరగతి), కౌటం అభిలాష్ (ఎనిమిదవ తరగతి)లు ఒకరోజు శాస్త్రవేత్తలుగా ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరగాని కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థుల్లో శాసీ్త్రయ దృష్టికోణాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం జిజ్జాస అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్ పరీక్షల ద్వారా విద్యార్థులు ఎంపికై నట్ల ఆయన తెలిపారు. నేడు(బుధవారం) కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ –సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీఎస్‌ఐఆర్–సీఎఫ్‌టీఆర్‌ఐ)లో నిర్వహించనున్న శాస్రవేత్తలతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో ఈ విద్యార్థులు పాల్గొని ఒకరోజు శాస్త్రవేత్తలుగా వ్యవహరిస్తారని తెలిపారు.
వేలం ఆదాయం రూ.6.46 లక్షలు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయ ఆవరణలో మంగళవారం కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్ముకునేందుకు వేలం పాటలు నిర్వహించగా రూ.6.46లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం ద్వారా పాట నిర్వహించగా గతేడాది కంటే లక్షా 26 వేల ఆదాయం ఎక్కువగా సమకూరిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ పరిశీలకులు కవిత, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్, ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్, సిబ్బంది సంతోష్, అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి
రేగొండ: జిల్లాలో బీజేపీ బలంగా ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నిక సన్నాహక సమావేశాన్ని మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్త్రతంగా ప్రచారం చేయాలని సూచించారు. నాయకులంతా సమష్టిగా పని చేసి పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. విలేకరులపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తిరుపతిరెడ్డి, మల్లేష్, శివకృష్ణ, చల్ల విక్రమ్, రాజుకుమార్, రమేష్ పాల్గొన్నారు.
30, 31న ఎంఏ తెలుగు ప్రవేశాలకు ఇంటర్వ్యూ
హన్మకొండ కల్చరల్ : వరంగల్ హంటర్‌రోడ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో 2025–26 విద్యా సంవత్సరానికి ఎంఏ తెలుగు రెగ్యులర్ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 30, 31వ తేదీల్లో విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ తెలుగు రెగ్యులర్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వరంగల్ జానపద గిరిజన విజ్ఞానపీఠంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని పీఠాధిపతి తెలిపారు. విద్యార్థులు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌లు, మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలు వెంట తీసుకు రావాలన్నారు. మరిన్ని వివరాలకు 99891 39136, 99894 17299 నంబర్లలో సంప్రదించాలని వారు సూచించారు.
ఏజెన్సీలో భారీవర్షం
ఏటూరునాగారం: ఏజెన్సీలోని ఏటూరునాగా రం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో గోదావరి, వాగులు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా అధికారులు అలర్ట్ చేశారు. మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ ఆదేశాలతో జిల్లా అధికారులు అప్రమత్తమై వాగుల వద్ద సిబ్బంది గస్తీ ఉండేలా చర్యలు చేపట్టారు.