
నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించాలి
భూపాలపల్లి: నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు. నానో యూరియా వినియోగం, ఎరువులు సక్రమ సరఫరాపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ, సహకార సంఘాల సీఈఓలు, ఇన్పుట్ డీలర్లతో ఐడీఓసీ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నానో యూరియాతో మొక్కల పెరుగుదల బాగా ఉంటుందని, కావాల్సిన పోషకాలు అందుతాయన్నారు. ఫీల్డ్ డెమో, గ్రామ సభల ద్వారా నానో యూరియా ప్రయోజనాలు రైతులకు తెలియజేయాలని సూచించారు. యూరియా వ్యవసాయానికి కాకుండా ఇతర పనులకు మళ్లిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని, సమృద్ధిగా నిల్వలు ఉన్నాయన్నారు. ఎరువుల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 89777 41771 లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 78930 98307 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఏఎస్పీ నరేష్‌కుమార్, జిల్లా ఇన్‌చార్జ్ వ్యవసాయ అధికారి బాబు, సహకార అధికారి వాలియానాయక్ తదితరులు పాల్గొన్నారు.
రేషన్‌కార్డులు పంపిణీ చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీ నుంచి అన్ని మండలాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని, విచారణ, పెండింగ్ ఉన్న దరఖాస్తులు క్లియర్ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సీఎస్ రామకృష్ణా రావులు మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడుతూ.. మహిళల ఉచిత బస్సు పథకంపై బస్‌డిపోలో వేడుకలకు ఏర్పాట్లు చేయాలన్నారు. భూమాత దరఖాస్తుల విచారణలో వేగం పెంచాలని ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. సమావేశంలో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ