మండలాల వారీగా రైతు సేవా కేంద్రాలు
జనగామ: మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళా సంఘాలను వ్యాపార రంగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ‘మహిళా శక్తి రైతు సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధిసంస్థ (డీఆర్‌డీఏ) సెర్ప్, వ్యవసాయ శాఖల సమన్వయంతో క్లస్టర్ల వారీగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
మహిళా శక్తి రైతు సేవా కేంద్రాలకు ప్రత్యేక బ్రాండ్, లోగోను రూపొందించారు. జిల్లాలో ఎక్కడ చూసినా ఒకే తరహా బోర్డు, ఒకే విధమైన షాపు అనే కాన్సెప్ట్‌తో ముందుకు సాగుతున్నారు. ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున ఏర్పాటు చేసి, ఆయా కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను వ్యవసాయ విస్తరణ అధికారులకు (ఏఈఓ) అప్పగించారు. ప్రస్తుతం జిల్లాలో 62 క్లస్టర్ల పరిధిలో రైతు సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
గ్రామ ఐక్య సంఘాల తీర్మానాల మేరకు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించారు. ఈ కేంద్రాలకు అవసరమైన లైసెన్సుల ప్రక్రియ పూర్తి కాగా, అనేక చోట్ల ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు, రైతు సేవలకు సంబంధించిన వస్తువులు ఒకేచోట అందుబాటులో ఉండనున్నాయి. ఈ కేంద్రాలను నిర్వహించే మహిళలకు వ్యాపార నిర్వహణ, కంపెనీల ప్రతినిధులతో వ్యవహరించే విధానం, రైతులతో సంబంధాలు మెరుగుపర్చుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. అలాగే గ్రామైక్య సంఘాల ద్వారా ఎంపికై న మహిళలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ఒక్కో కేంద్రం ద్వారా యజమాని మహిళతో పాటు మరో ఇద్దరికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఇప్పటివరకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం మండల లేదా జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు 62 క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు గ్రామ స్థాయిలోనే సేవలు అందనున్నాయి. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ పథకాలు కూడా ఈ కేంద్రాల ద్వారానే రైతులకు చేరే అవకాశం ఉంది. మట్టి పరీక్షలు, పంట మార్పిడి, కాలానుగుణంగా సాగు విధానాలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
డీఆర్‌డీఏ–సెర్ప్, వ్యవసాయ శాఖల నుంచి ఈ కేంద్రాలకు నిరంతర సాంకేతిక సహకారం అందనుంది. నాణ్యమైన ఉత్పత్తులు, విశ్వసనీయ సేవలు అందించే కేంద్రాలుగా మహిళా శక్తి రైతు సేవా కేంద్రాలను తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహిళా సంఘాలను చిన్న స్థాయి పొదుపు, రుణాల కార్యకలాపాల నుంచి పెద్దఎత్తున వ్యాపార రంగంలోకి తీసుకువెళ్లే ఈ నిర్ణయం రాష్ట్రానికి జిల్లాను రోల్ మోడల్‌గా నిలబెట్టనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలను కోటీశ్వరులు చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి కలెక్టర్ ముందుచూపుతో మహిళా సంఘాల అభ్యున్నతి కోసం చేపట్టిన రైతు సేవా కేంద్రాల ఏర్పాటు గొప్ప నిర్ణయంగా మహిళలు అభిప్రాయపడుతున్నారు.
మండలం కేంద్రాల
సంఖ్య
బచ్చన్నపేట 07
చిల్పూరు 04
దేవరుప్పుల 05
స్టేషన్‌ఘన్‌పూర్ 05
కొడకండ్ల 03
పాలకుర్తి 07
రఘునాథపల్లి 08
జనగామ 07
లిం.ఘణపురం 04
జఫర్‌గఢ్ 05
తరిగొప్పుల 03
నర్మెట 04


