జనగామ: మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో హాలులో శుక్రవారం చైర్‌పర్సన్ కడకంచి బాలమణి అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ సాధారణ సమావేశంలో వార్డు సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రజాఅవసరాలపై కౌన్సిలర్లు విస్త్రతంగా చర్చించారు. ఇందులో 28 సాధారణ ఎజెండా అంశాలు, 3 టేబుల్ ఎజెండా అంశాలు కలిపి మొత్తం 31 అంశాలను కౌన్సిల్ ముందుంచగా, వాటిలో 29 అంశాలను ఆమోదించి, 2 అంశాలను వాయిదా వేశారు. సమావేశంలో ఒక్కో వార్డు కౌన్సిలర్ తమ పరిధిలోని సమస్యలను ప్రస్తావిస్తూ పరిష్కార చర్య లు చేపట్టాలని కోరారు.
సమస్యల ఏకరువు..
సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, కుక్కల బెడద, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పెన్షన్ల పంపిణీతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని 6వ వార్డు కౌన్సిలర్ బాలభరద్వాజ్ కోరారు. 9వ వార్డులో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం కొనసాగుతోందని కౌన్సిలర్ గునిగంటి వెన్నెల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 18వ వార్డులో డ్రెయినేజీ, తాగునీటి సమస్యలు, రోడ్ల అభివృద్ధి, వార్డులో అంగన్‌న్‌వాడీ సంఘాలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు, మున్సిపల్ ఆధీనంలోని మినీ స్టేడియంలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కౌన్సిలర్ గోపగోని సుగుణాకర్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో డ్రెయినేజీ, వరద నివారణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని 3వ వార్డు సీపీఎం కౌన్సిలర్ బూడిద జ్యోతిగోపి కోరారు. బాలాజీనగర్, జ్యోతినగర్, హైదరాబాద్ మెయిన్‌రోడ్ ప్రాంతాలు స్వల్ప వర్షానికే జలమయం అవుతున్నాయని తెలిపారు. 3వ వార్డు నుంచే ఎక్కువగా మున్సిపాలిటీకి అధిక ఆదాయం వస్తు న్నందున రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
మేం చెబుతున్నాం..మీరు నిధులు ఇవ్వండి
21వ వార్డులో విద్యుత్ స్తంభాలు వంగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయని, వర్షాకాలానికి ముందే కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ మామిడాల రజితరాజు కోరారు. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మున్సిపల్ కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలిపారు. 11వ వార్డులో డ్రెయినేజీ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్ ఎనగందుల అనూషకృష్ణ చెప్పారు. 25వ వార్డులో గాంధీ కమ్యూనిటీ ప్లేస్‌లో లైబ్రరీ, మహిళా సమావేశాల కోసం భవన నిర్మాణానికి అంచనాలు పూర్తయ్యాయని, అవసరమైన నిధులు కేటాయించాలని కౌన్సిలర్ పాముకుంట్ల ప్రసాద్‌గౌడ్ కోరారు. నెహ్రూ పార్క్ ప్రాంతంలో పార్క్ లేకపోవడంతో ఆ స్థలానికి నెహ్రూ సెంటర్ లేదా వినాయక సెంటర్‌గా పేరు మార్పు చేయాలని ప్రతిపాదించారు. 1వ వార్డులో సిబ్బంది కొరత, కుక్కలు, కోతులు బెడదతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని కౌన్సిలర్ సజ్జ దుర్గా ప్రసాద్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. 26 వార్డులో వీధి కుక్కలు, డ్రెయినేజీ సమస్యలపై దృష్టిసారించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను నుంచి విముక్తి కలిగించాలని కౌన్సిలర్ సేవెల్లి మధు కోరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు త మ తమ వార్డుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రెయినేజీలు, వరద నివారణ, ప్రజా సమస్యల పరిష్కారంపై విస్త్రృతంగా చర్చించగా, సంబంధిత అంశాలపై అధికారులు చర్యలు చేపట్టాలని కౌన్సిల్ సూచించింది. వార్డుల అవృద్ధిపై ప్రత్యేక ఫోకస్ ఉందని చైర్‌పర్సన్ బాలమణి తెలిపారు. సమావేశంలో కమిషనర్ చిమ్ముల రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న చైర్‌పర్సన్ బాలమణి, పక్కన కమిషనర్, మాట్లాడుతున్న కౌన్సిలర్ బూడిద జ్యోతిగోపి
కౌన్సిల్ సమావేశంలో
గళం విప్పిన కౌన్సిలర్లు
డ్రెయినేజీలు, పారిశుద్ధ్య నిర్వహణపై నిలదీత
పట్టణ సమస్యలపై మూడు గంటల పాటు చర్చ


